Wednesday, November 20, 2024

Exclusive – ఎన్‌ఫోర్స్‌మెంట్ పంజా …. పొలిటిక‌ల్ లీడ‌ర్లే టార్గెట్‌!

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) దేశంలో ఆర్థిక చట్టాలను అమలు చేయడానికి ఏర్పాటు చేసిన ఓ స్వతంత్ర సంస్థ. ఆర్థిక నేరాలపై విచారణ నిర్వహించే ఆర్థిక గూఢచార సంస్థగా కూడా దీనికి పేరుంది. భారత ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ శాఖలో ఇదో విభాగం. అయితే.. ఈ మధ్య కాలంలో ఈడీ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. పలానా వారిని అరెస్ట్ చేశారని.. సోదాలు చేశారని.. ఆస్తులు అటాచ్ చేశారని. ఇలా చాలా కాలంగా ఈడీ పేరు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. అయితే.. ఈ పదేండ్ల కాలంలో ఈడీ రెచ్చిపోయిన విధానం.. పొలిటికల్​ లీడర్లను టార్గెట్​గా చేసుకుని దాడులు చేయడం విమర్శలకు దారితీసింది.

ఆంధ్రప్రభ స్మార్ట్​, స్పెషల్​ డెస్క్​ – దేశంలో ఎన్​ఫోర్స్​ డైరెక్టరేట్​ హల్​చల్​ సాగుతోంది. ఈ పదేళ్లలో ఈడీ రాడార్‌లోకి వచ్చినవారిలో ఎక్కువమంది పొలిటిషియన్సే ఉన్నారు. లెటెస్ట్‌ అరెస్ట్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత.. ఇక.. సోదాల విషయాల్లో 86 రెట్లు.. అరెస్టులు 26 రెట్లు.. జప్తులు 24 రెట్లు.. చార్జీషీట్ల సంఖ్య 12 రెట్లు.. ఇలా ప్రతి విషయంలో పెరగడమే కానీ.. తరగడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిందితులను అప్పగించాలంటూ పలు దేశాలకు ఈడీ రిక్వెస్ట్‌ లెటర్లు పంపింది. మొత్తం 43 మందిని తమకు అప్పగించాలని కోరింది. ఇందులో విజయ్‌ మాల్యా, నీరవ్ మోడీ, సంజయ్ భండారీ ఉన్నారు. గణాంకాలు గొప్పగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఈడీ ఫుల్ జోష్‌పై ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది.

- Advertisement -

గ‌ణ‌నీయంగా పెరిగిన సోదాలు

ఈ క్రమంలో ఈ పదేండ్ల కాలంలో ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జోరు బాగా పెరిగిందని తెలుస్తోంది. సోదాలు, అరెస్టుల సంఖ్యతో పాటు జప్తు సొమ్ము ఎక్కువగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే.. సుమారు 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. ఇదే సమయంలో అరెస్టుల సంఖ్య కూడా 24 రెట్లు పెరిగింది. ఈ క్రమంలో జులై 2005 – మార్చి 2014.. ఏప్రిల్ 2014 – మార్చి 2024 సంవత్సారాలకు చెందిన లెక్కలను ఈడీ విడుద‌ల చేసింది.

యూపీఏ హయాంలో ఎలా ఉందంటే..

ఈ గణాంకాల ప్రకారం… మన్మోహన్‌ సింగ్ ప్రధానిగా ఉన్న యూపీఏ ప్రభుత్వంలోని తొమ్మిదేళ్లలో 1,797 కేసులను ఈడీ నమోదు చేస్తే.. గత పదేళ్లలో ఆ సంఖ్య 5,155కు చేరింది. అంటే.. కేసుల విషయంలో వృద్ధి సుమారు మూడు రెట్లు అన్నమాట! ఇక.. సోదాల విషయానికొస్తే… యూపీఏ హయాంలోని తొమ్మిదేళ్లలో 84 సోదాలు జరగగా.. 2014-24 మధ్య దేశవ్యాప్తంగా 7,264 సోదాలను ఈడీ నిర్వహించింది.

ఏకంగా ల‌క్ష కోట్ల‌కు పైగా స్వాధీనం

ఆస్తుల జప్తు విషయానికొస్తే.. యూపీఏ హయాంలో 29 అరెస్టులు జరిగి, 5,086.43 కోట్ల ఆస్తులు జప్తు చేయగా.. పదేళ్ల మోదీ పాలనలో 755 మందిని ఈడీ అరెస్టు చేసి, రూ.1,21,618 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. అంటే అరెస్టులు 26 రెట్లు, జప్తులు 24 రెట్లు పెరిగాయన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇదేక్రమంలో… యూపీఏ హయాంలో 102 చార్జిషీట్లు దాఖలవ్వగా.. బీజేపీ పాలనలో 1281 చార్జిషీట్లు నమోదయ్యాయి.

95 శాతం కేసుల రాజ‌కీయ నేత‌ల‌పైనే

ఇక ఈడీ విడుదల చేసిన డేటాపై స్పందించిన ఒక ఈడీ అధికారి.. మనీ లాండరింగ్‌ నేరాలను కట్టడి చేయడానికి తాము తీసుకున్న చర్యలను ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. అయితే… విపక్షాలు మాత్రం రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీని బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపిస్తున్నాయి. కానీ, ఈడీ నమోదు చేసే కేసుల్లో మాజీలతో పాటు సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారని చెబుతున్నారు అధికారులు.

కేంద్రం చెప్పుచేతల్లో ఈడీ, సీబీఐ

2023లో రాజకీయ నేతలపై ఈడీ నమోదు చేసిన కేసులు.. 176.. అయితే గత పదేళ్లలో నమోదైన కేసులతో కంపేర్ చేస్తే ఇది మూడు శాతంగా ఉన్నా గత రెండేళ్లలో మాత్రం నేతలపై కేసులు మాత్రం పెరిగాయి. అందుకే విపక్షాల విమర్శలకు బలం చేకూరుతుంది. ఈ పదేళ్లలో ఈడీ, సీబీఐ లాంటి ఏజెన్సీలు కేంద్ర పెద్దల చేతుల్లోని కీలుబొమ్మగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. ఇలా ఒక్క రాహుల్ గాంధీ మాత్రమేకాదు. దేశంలోని అనేక పార్టీల నేతలు ఈడీ, సీబీఐ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలకు బీజేపీ నేతలు కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నారు.

అరెస్టు అయినవారిలో..

ఇప్పటి వరకు అరస్టైన వారిలో జస్ట్‌ 3 పర్సెంట్ మాత్రమే పొలిటికల్ లీడర్స్ ఉన్నారని మిగిలిన వారంతా వ్యాపారవేత్తలు, అధికారులే ఉన్నారంటున్నారు. అంతేకాదు లక్షల కోట్ల విలువైన అక్రమాస్తులను ఈడీ సీజ్ చేసిందని గొప్పగా చెప్పుకుంటున్నారు.ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఈడీకి అపరిమిత అధికారాలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చైతే నడుస్తుంది.

డైరెక్టర్ లేని ఏకైక శాఖ

అంతేకాదు ఈడీ డైరెక్టర్‌ కె.మిశ్రా విషయంలో కూడా మోదీ సర్కార్‌కు సుప్రీంకోర్టు తలంటింది. ఎందుకంటే ఆయన పదవీ కాలాన్ని అనేకసార్లు పొడిగించింది కేంద్రం దీనికి అనేక సాకులు చెప్పింది. చివరికి సుప్రీంకోర్టు ఒప్పుకోకపోవడంతో తొలగించక తప్పలేదు. ఆ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఈడీకి పర్మనెంట్‌ డైరెక్టర్‌ని నియమించ లేదు. ప్రస్తుతం తాత్కాలిక డైరెక్టర్‌గా రాహుల్‌ నవీన్ ఉన్నారు.. కేంద్రం శాశ్వత నియామకం మాత్రం చేపట్టడం లేదు? ఎందుకనేది అస్సలు అర్థం కాని ప్రశ్న. 2014 తర్వాత రాజకీయ నేతలపై నమోదైన కేసుల్లో 95 శాతం మంది ప్రతిపక్షానికి చెందినవారే కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement