Monday, July 8, 2024

Exclusive – శెభాష్ రేవంత్…

రేవంత్‌ వ్యాఖ్యలపై నాడు విమర్శలు
నేడు విమర్శకులూ మద్దతు
సత్సంబంధాలకు విశేష చొరవ
వెూడీని ఆకట్టుకున్న వైనం
రాజ్యాంగమే అందరికీ శిరోధార్యం
ఎన్నికల వరకే రాజకీయం
రేవంత్‌ మార్గం అందరికీ ఆవెూదయోగ్యం

(పసునూరి భాస్కర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌)

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హస్తినలో గురువారం ఒక అపూర్వ దృశ్యం ఆవిష్కృతమైంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్రమోడీని ఒకరి తర్వాత మరొకరు కలుసుకున్నారు. కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలో ప్రధానితో సమావేశం కావడం రాజకీయవర్గాల్లో ఒకరకంగా సంచలనంగానే మారింది. రేవంత్‌, చంద్రబాబు నాయుడులు ఎక్కడా తారసపడకపోయినా శనివారం వారిద్దరి మధ్య హైదరాబాద్‌లో విభజన సమస్యలపై భేటీ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే తమ రాష్ట్రాలకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ముఖ్యమంత్రులు ఇద్దరూ వినతి పత్రాలు సమర్పించారు.

ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫెడరల్‌ స్ఫూర్తిని చక్కగా చాటి చెప్పారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్ర ప్రగతి అసాధ్యమని రాజ్యాంగం చెప్పేమాట. అయితే, సమకాలీన రాజకీయాల్లో వ్యక్తిగత భేషజాలు, పార్టీ రాజకీయాలతో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు దెబ్బతింటున్నాయి. రాజకీయ లబ్ధి కోసమే ఆయా పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. రెండు చోట్లా ఒకే పార్టీ అధికారంలో ఉంటే అది వేరే సంగతి. కానీ, ప్రాంతీయ అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఓటర్లు స్పందిస్తారు. దీంతో అక్కడో పార్టీ ఇక్కడో పార్టీ అధికారంలోకి రావడం సర్వసాధారణం. కానీ, రాజకీయ విభేదాలతో అభివృద్ధికి గొడ్డలి పెట్టులా మారుతోంది.

- Advertisement -

సరిగ్గా ఇదే నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండగా, కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉంది. గత పదేళ్లుగా ఆయా కారణాల వల్ల నిప్పు, ఉప్పులా వ్యవహారం సాగింది. కానీ, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఫెడరల్‌ స్ఫూర్తితో పనిచేస్తానని ప్రమాణం స్వీకారం రోజే రేవంత్‌ ప్రకటించారు. అదే అంశాన్ని ఇటీవలే ఆదిలాబాద్‌ వేదికగా, నాడు మోడీ సమక్షంలోనే సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత ప్రతి సందర్భంలోను, ఢిల్లీ పర్యటనల్లోనూ ప్రధాని మోడీతో సహా మంత్రులను కలవడం, సహకరించాలని విజ్ఞప్తులు చేయడం జరుగుతోంది. కేంద్రంలో ప్రధానిది పెద్దన్న పాత్ర అని గుర్తు చేస్తూ అదిలాబాద్‌ సభలోనే మోడీని బడేభాయ్‌ అని సంభోదించిన విషయం విదితమే.

రేవంత్‌ వ్యాఖ్యలపై ఆనాడు విమర్శలు వచ్చినా ఆయన అనుసరించిన విధానం ఫెడరల్‌ స్ఫూర్తికి అద్దం పడుతోందని మేధావి వర్గం ఇప్పుడు స్పష్టం చేస్తోంది. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అందరూ అభివద్ధిపైనే దృష్టి సారించాలని రేవంత్‌ అనుసరిస్తున్న విధానం సూపర్‌హిట్‌గా మారుతోంది. రాజకీయంగా ప్రత్యర్థి వర్గమైనా కేంద్రంతో సత్సంబంధాల కోసం రేవంత్‌ చేస్తున్న కృషిని భేష్‌ అని రాజకీయ విమర్శకులు కూడా అంగీకరిస్తున్నారు. రేవంత్‌ చొరవకు మోడీ సహకారం కూడా తోడైందంటున్నారు. అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇస్తూ ప్రధాని, కేంద్ర మంత్రులు కూడా రేవంత్‌కు సహకరించడం ఫెడరల్‌ స్ఫూర్తిని పెంచుతోందని చెబుతున్నారు. మొత్తానికి రేవంత్‌ ప్రయత్నం దేశంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకుని దేశంలో మిగిలిన రాష్ట్రాలు కూడా ఫెడరల్‌ స్ఫూర్తిని ప్రదర్శిస్తే వికసిత్‌ భారత్‌ లక్ష్యం నెరవేరడం మరింత త్వరితగతిన సాధ్యపడుతుందని అంటున్నారు. సమాఖ్య రాజ్యం ప్రకారం కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా అన్ని రాష్ట్రాలకు సమానావకాశాలు కల్పించడం ద్వారా అభివృద్ధి సాధించవచ్చన్నది రాజ్యాంగ నేతల అభిప్రాయం. అయితే, ఇందులో సంకుచిత రాజకీయాలు జొరబడి గత రెండు దశాబ్దాలుగా ఎంతో నష్టపోయిన విషయాన్ని రాజకీయ పార్టీలతో పాటు ఆయా రంగాల నిపుణులు కూడా గుర్తించి సమాఖ్య స్ఫూర్తికి సహకరించాలని సామాజికవాదులు కోరుతున్నారు.

యువనేత రేవంత్‌రెడ్డి సంప్రదాయ రాజకీయాలను పక్కనబెట్టి సత్సంప్రదాయానికి తెరతీశారన్నది వాస్తవమని వివిధ రంగాల నిపుణులు అంటున్నారు. ప్రతి అంశాన్నీ రాజకీయంగా చేస్తూ పోతే ఎప్పటికీ ఆయా రాష్ట్రాలు ముందుకు సాగడం కష్టసాధ్యంగా మారుతుందని, ఏమాత్రం అభివృద్ధి చేసి చూపించలేక పోతే ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ నేతలు కూడా ఎక్కువ కాలం మనుగడ సాధించలేరన్న సంగతి కూడా చరిత్ర చెబుతోందని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత రాజకీయాలను పక్కనబెట్టి రేవంత్‌ అనుసరిస్తున్న పద్ధతులతో ముందుకు వెళితే భవిష్యత్‌ తరాలకు మేలు చేసిన వారవుతారని సామాజికవేత్తలతో పాటు ఆర్థికవేత్తలు కూడా ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement