దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు
స్కిల్ యూనివర్సిటీకి వేగవంతంగా అడుగులు
తెలంగాణను స్కిల్స్ హబ్‌గా మార్చే చాన్స్
150 ఎకరాల భూమి కేటాయించిన సర్కారు
వంద కోట్ల నిధులు అందించేందుకు నిర్ణయం
దసరా నుంచి మొదలు కానున్న పనులు
యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా
ఇప్పటికే ఆరు కోర్సులకు కోసం డిజైన్ పూర్తి
ఇంప్లీడ్ అవుతున్న కీలకమైన 140 కంపెనీలు
మెయింటెనెన్స్ కోసం కార్పొరేట్ కార్పస్ ఫండ్
పబ్లిక్, ప్రైవేటు సంస్థల నుంచి భాగస్వామ్యం
డిమాండ్ ఉన్న రంగాలపైనే ఫస్ట్ ఫోకస్
సంతోషం వ్యక్తం చేస్తున్న యువతీ, యువకులు
ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్: ఇప్పుడు మన ముందున్నది పోటీ ప్రపంచం. సత్తా ఉన్నవారే నెగ్గుకురాగలరు.. గెలవగలరు, నిలవగలరు. ప్రస్తుతం చాలామంది స్టూడెంట్స్ కాలేజీ నుంచి బయటికి వస్తున్నారు. కానీ, వారికి సరైన స్కిల్స్ లేకపోవడంతో మళ్లీ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అందుకే ప్రస్తుతం మార్కెట్‌కు తగ్గట్టు స్కిల్స్ ఏంటో వాటిపై మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ సాధించే సత్తాను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేసింది. అందుకోసమని సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీని తెరమీదకు తీసుకొచ్చారు. ఇది ఆయన కలల ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు 150 ఎకరాల భూమిని సర్కారు కేటాయించింది. వందకోట్ల రూపాయల నిధులను కూడా అందించేందుకు సీఎం నిర్ణయించారు. అంతేకాకుండా ఈ దసరా నుంచి క్లాసులు ప్రారంభం కావాలని పనులు చేపట్టారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి.
యూనివర్సిటీ చైర్మన్‌గా ఫేమస్ బిజినెస్ పర్సన్..
ఈ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా, కో చైర్మన్‌గా శ్రీనివాస సి.రాజు ఉన్నారు. ఇప్పటికే ఆరు కోర్సులను కూడా డిజైన్ చేశారు. మొత్తం 140 కంపెనీలు ఇందులో ఇంప్లీడ్ అవుతున్నాయి. ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్‌లో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులను స్టార్ట్ చేయనున్నారు. వీటిల్లో ట్రైనింగ్ ఇచ్చేందుకు ఎస్బీఐ, న్యాక్, డాక్టర్ రెడ్డీస్, టీబీఏజీఏ, అదానీ, సీఐఐ లాంటి సంస్థలు రెడీ అవుతున్నాయి. ఇవన్నీ బోర్డు మీటింగ్‌లో డిసైడ్ చేశారు. అంతేకాకుండా యూనివర్సిటీ కంప్లీట్ మెయింటనెన్స్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడానికి ఇండస్ట్రీయలిస్ట్లను సీఎం రేవంత్ రిక్వెస్ట్ చేశారు.
ఈ కామర్స్, లాజిస్టిక్స్కూ ప్రయారిటీ..
పబ్లిక్, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటవుతోంది. ఇది ఇండిపెండెంట్‌గా పనిచేయనుంది. ఇందులో మూడు నుంచి నాలుగేళ్ల డిగ్రీ కోర్సులతో పాటు.. 3 నుంచి 4 నెలల వ్యవధి నుంచి ఏడాది పాటు డిప్లమా కోర్సులు కూడా ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో 2 వేల మందికి ట్రైనింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా త్వరగా ఈ నెంబర్‌ను 20 వేలకు తీసుకెళ్లాలనేది ప్లాన్. ఫార్మా, కన్స్ట్రక్షన్, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్. ఈ-కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్.. గేమింగ్ అండ్ కామిక్స్ ఇలా ప్రతి ఒక్క రంగంలో కోర్సు ఉంటుంది. ఈ కోర్స్‌లో ఆ రంగంలో ప్రముఖంగా కంపెనీలతో అవగాహన ఒప్పందం ఉంటుంది. అంటే స్కిల్ నేర్చుకుంటే చాలు.. జాబ్ గ్యారెంటీ అన్నమాట.
ఫార్మా రంగానికి పెద్దపీట..
నిజానికి ఈ యూనివర్సిటీ ఏర్పాటు అటు యువతకు, ఇటు ఇండస్ట్రీస్‌కు విన్ విన్ పరిస్థితి లాంటిది. ఎందుకంటే ఇండస్ట్రీల అవసరాలకు అనుగుణంగా వారు ట్రైనింగ్ అండ్ సిలబస్‌ను డిజైన్ చేసుకోవచ్చు. డిమాండ్ ఉన్న రంగాలపైనే మొదట ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫార్మాలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉండటంతో.. ఆ తరహా కోర్సుల్లో ఎక్కువ సీట్లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు.
విజయదశమి నుంచే కోర్సులు ప్రారంభం..
మరి స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన మాత్రమే జరిగింది. మరి ఇప్పటికిప్పుడు క్యాంపస్ ఎలా? దీనికి సొల్యూషన్ ఏంటి? అయితే టెంపరరీగా కొన్ని క్యాంపస్‌లను సెటెక్ట్ చేసి అందులో క్లాస్‌లను నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ క్యాంపస్.. న్యాక్ క్యాంపస్.. ఇలా కొన్నింటిని శాటిలైట్ క్యాంపస్‌లుగా ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి.. ఈ విజయదశమికి కోర్సులు ప్రారంభం కావడం ఖాయం. ఫస్ట్ బ్యాచ్‌కు సంబంధించిన క్లాస్‌లు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మొత్తానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నుంచి త్వరలోనే దేశానికి కావాల్సిన స్కిల్డ్ ఎంప్లాయిస్ తయారు కానున్నారు.