Thursday, December 19, 2024

Exclusive – మీ డాక్టర్ మంచోడేనా. .

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌: తెలంగాణ న‌కిలీ డాక్ట‌ర్ల‌కు అడ్డాగా మారుతోంది. కొంత‌మంది వైద్యం పేరుతో డ‌బ్బులు గుంజుతూ జ‌నాల ప్రాణాలతో చెలమాడుతున్నారు. అర్హత లేకున్నా, నాడి పట్టి రోగుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఏదైనా రోగం వస్తే డాక్ట‌ర్ నయం చేస్తాడని రోగుల నమ్మకం. కానీ, డబ్బులకు ఆశపడి ప్రజల ప్రాణాలతో కొంత‌మంది చెల‌గాటం ఆడుకుంటున్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇప్పటి వరకు 100 మంది నకిలీ డాక్ట‌ర్ల‌ గుట్టు బయటపడింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో ఎలాంటి ఎంబీబీఎస్ కానీ, ఇతర వైద్య పట్టాలు కానీ లేకుండానే చాలామంది ప్రాక్టీసు చేస్తున్నట్లు గుర్తించారు.

వీరు మాత్రం దొరికిపోయారు ఇలా..=

డెంటల్‌ డిగ్రీ పొందిన ఓ వైద్యురాలు నాగోలులో ఎస్‌జేఎం పేరుతో క్లినిక్‌ తెరిచింది. దీంతో ఏకంగా చర్మ వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. డెర్మటాలజిస్టులు చేయాల్సిన కాస్మటాలజీ వైద్యం, హెయిర్‌ ట్రాన్స్‌పాంట్ కూడా ఈమెనే చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో గుర్తించారు.

- Advertisement -

శ్రీసాయి క్లినిక్‌ పేరుతో ఓ నకిలీ డాక్ట‌ర్‌ తిరుమలగిరిలో ప్రాక్టీసు చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన రోగులకు ఐవీ ఫ్లూయిడ్స్, యాంటిబయోటిక్‌ ఇంజెక్షన్లు ఇస్తున్నాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి విచార‌ణ చేప‌ట్టారు.

ఓ వ్యక్తి విదేశాల్లో ఎంబీబీఎస్‌కి సమానమైన వైద్య విద్యను అభ్యసించాడు. దీంతో ఏకంగా ఎండీ బోర్డు పెట్టి, చర్మ వ్యాధి నిపుణుడిగా హైదరాబాద్లో చలామణి అవుతున్నాడు. కాస్త అనుభవంతోనే ఎక్స్‌ప‌ర్ట్‌లుగా..డాక్ట‌ర్లుగా చెలామణి అవుతున్న ఈ నకిలీ డాక్టర్ల వద్ద సరైన పట్టాలు ఉండవు. కొంతమంది నకిలీ పట్టాలు సృష్టించి క్లినిక్‌లు నడపుతున్న‌ట్టు ప‌రిశీల‌న‌లో తేలింది.

ఇంకొంతమంది ఏవో గుర్తింపు లేని యూనివర్సిటీల నుంచి పట్టాలు కొనుక్కొని డాక్టర్లుగా ఆస్పత్రులే పెడుతున్నారు. మెడికల్‌ షాపులు కూడా పెట్టించి అనుమతులు లేకుండా మందులను అమ్ముతున్న‌ట్టు తెలంగాణ మెడిక‌ల్ కౌన్సిల్ ఎంక్వైరీలో వెల్ల‌డ‌య్యింది.

తక్కువ ఫీజు ఉండడంతో..తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌, దాని చుట్టుప‌క్క‌ల ఉన్న రంగారెడ్డి, మెద‌క్ జిల్లాల్లోనూ దాదాపు 140 వరకు ఇలాంటి షాపులను ఔషధ నియంత్రణ శాఖ గుర్తించింది. హోల్‌సేల్‌ డీలర్లు కూడా ఇలాంటి క్లినిక్‌లకు మందులను సరఫరా చేస్తూ ఉన్నారు. బస్తీలు, మురికి వాడలను లక్ష్యంగా చేసుకొని క్లినిక్‌లు పెడుతున్నారు.

ప్రైవేటు హాస్ప‌ట‌ళ్ల‌లో కన్సల్టెంట్‌ ఫీజులు ₹500 నుంచి ₹1500 వరకు ఉండటం, ఈ నకిలీ డాక్టర్లు కేవలం ₹50, ₹100 వసూలు చేస్తుండటంతో పేదలు ఎక్కువ మంది వీరి దగ్గరకు వెళ్తున్నారు.

ఓవర్ డోస్ మెడిసిన్ వాడకం..

కొందరు నకిలీ డాక్టర్లు క్లినిక్కు వెళ్లిన రోగులకు అవగాహన లేక అధిక మోతాదుతో కూడిన మందులను ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా హై యాంటీ బయోటిక్స్‌తో అప్పటికప్పుడు రోగం నయం అనిపిస్తుంది. కానీ, కొన్నిరోజుల తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కీళ్ల నొప్పులు, ఇతర సమస్యలకు స్టెరాయిడ్లు ఇస్తున్నారని అధికారుల పరిశీలనలో వెల్లడయ్యింది.

అర్హత లేకుండా ప్రాక్టీస్ నేరం..

చట్ట ప్రకారం అర్హత లేని వ్యక్తులు క్లినిక్‌లు తెరవడం, ప్రాక్టీసు చేయడం నేరం. ఎన్‌ఎంసీ చట్టం 34, 35 ప్రకారం వీరిపై కేసు నమోదు చేస్తారు. టీజీఎంసీ ఆధ్వర్యంలో నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో 30బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. నకిలీ డాక్టర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – డాక్టర్‌ జి.శ్రీనివాస్‌, నీట్రీజీఎంసీ వైస్‌ ఛైర్మన్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement