Tuesday, November 26, 2024

Exclusive on Jana Senani – ఎక్కడా తగ్గలే.. లీడరంటే..వీడనోడే ‍‍‍‍‍‍‍‍

తన వ్యూహం తనదే
సేవ్ డెమోక్రసీ ధ్యేయం
కూటమి కూర్పులోనే
అసలు సిసలు సత్తా
భీమవరం వదలడంతే
మారిన మేనరిజం
ఇదే నయా పవనిజం

ఆక్రోశం..ఆవేదన.. ఆందోళన , ఆవేశం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం ఇవ్వన్నీ నాయకత్వ లక్షణాలు కాగ, సంయమనం, సమన్వయం అత్యంత కీలకం. ఈ లక్షణాలనే నాయకత్వానికి ప్రతిరూపాలు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. జనసైన్యాధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లో ఇప్పుడిప్పుడే ఈ లక్షణాలు వ్యక్తమవుతుంటే… మరీ ముఖ్యంగా రాజకీయ విశ్లేషకుల్లో ఆశ్చర్యం తప్పటం లేదు. ఇందులో కర్తవ్యం, అందుకు అనుగుణమైన అడుగుల వ్యూహం కళ్లకు కట్టినట్టు కనిపించటం విశేషం. ప్రత్యర్థిని ఎదుర్కొనే వ్యూహం నుంచి బలగాన్ని సమీకరంచే పొత్తుల ఎత్తుగడ వరకూ పవన్ కళ్యాణ్లో 15 ఏళ్ల రాజకీయ అనుభవం రంగరిస్తోందంటే అతిశయోక్తి కానే కాదు.

పదేళ్ల కిందట ఎన్నికల్లో పోటీకి దూరం … 2019లో బలాన్ని బేరీజు వేసుకునే వ్యూహం నుంచి ఇప్పడు అసెంబ్లీలో అడుగుపెట్టటమే అసలు వ్యూహంతో బలాన్ని సమీకరించటం కూడా పవన్ కళ్యాణ్ ప్రధాన వ్యూహమే. అందుకే ఆయనకు సీట్ల సంఖ్య -ముఖ్యం కాలేదు. సీఎం పదవిపై ఆశతో ఉంటారు. తనకూ సీఎం కావాలనే ప్రగాఢ కోరిక ఉంది. కానీ గెలపు ముఖ్యం, ఆయన మాటల్లోనే గోదావరి జిల్లాల్లో 34 స్థానాల్లో జనసేన బలం ఉంది. ఈ స్థానాలతో సీఎం అయ్యే అవకాశం ఉందా? అని ఆయన ప్రశ్నించి.. జనసేనలో ఆలోచన పెంచటం విశేషం. అధికారానికి ఎన్ని సీట్లు కావాలి? మనకు ఎంత బలం ఉంది. ఈ విజ్ఞత పార్టీ అధ్యక్షుడికి అత్యవసరం. నిజంగా పవన్ కళ్యాణ్ ఎంతో లోతుగా ఆలోచించారు. ఎందరో మేధావులు ఆయనపై తీవ్ర వత్తిడి తెచ్చారు. కానీ ఎక్కడా లొంగలేదు. తలొగ్గలేదు. తుది నిర్ణయం తనదే అనే కోణంలో..కాస్త అభిమాన జనం కోపగించుకున్నా.. ఆ బాధనూ అధినేత పవనే దిగమింగారు. ఈ వ్యూహ రచనలో ఏకాభిప్రాయానికే పెద్ద పీట వేశారు. 100 సీట్లు, 80 సీట్లు.. ఇలా మేధావి వర్గం పదే పదే సతాయించినా ఒడ్డు దిగలేదు. కానీ…

ఏపీలో ఏకచత్రాధిపత్యం నడుస్తోంది. ఏ ప్రజలు గెలిపించారో? ఆ ప్రజల మనోగతికి విలువ లేదు. అభివృద్ధి ఊసే లేదు. ప్రతి అభివృద్ధి పని వెనుక .. స్కీమ్ బదులు స్కామ్ కబుర్లే కనిపిస్తున్నాయి. రాజధాని విషయంలో ఇంటర్నల్ ట్రేడింగ్ పేరుతో.. రాజధాని మూడు ముక్కలైంది. శాసన సభలో ప్రజల మనోగోడు వినే పరిస్థితి లేదు. ప్రభుత్వం మాటే చెల్లుబాటు. 151 ఎమ్మెల్యేల బలంతో ప్రతి బిల్లూ మూజువాణి ఓటుతో ప్రజలపై రుద్దే పరిస్థితి ఏర్పడింది. శాసన సభలో ప్రశ్నించే శక్తి ప్రతిపక్షానికి లేదు. ప్రజాసమస్యపై గొంతెత్తితే పోలీసు బలగంతో అణిచివేచే నియతంతృత్వ పోకడే కనిపిస్తోంది. ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే ధ్యాస ఇక్కడ కనిపించటం లేదు. జనానికి రూపాయిలు జల్లితే ప్రభుత్వానికి బలం సమకూరినట్టే అనే భావన పెరిగింది. ఈ ధ్యేయంతోనే నలుగురు కూడితేనే… సర్కారును ప్రశ్నించి, దండించే శక్తి సమకూర్చుకోవాలనే .. ఏపీలో ప్రజాస్వామ్య రక్షణే తక్షణ కర్తవ్యంగా పవన్ కళ్యాణ్ భావించటం ఒక ఎత్తు.. జట్టును కూడగట్టటం మరోక ఎత్తు.

ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తే -కూటమి ఏర్పాటు చేశాడు అంటూ -తన సత్తా పై పవనన్న పరోక్ష కామెంట్ జనంలో ఆలోచన రేకెత్తించింది. 2014లో మిత్రులే 2019లో శత్రువులయ్యారు. టీడీపీ, బీజేపీ దూరమయ్యాయి. ఎన్డీయే చేరటానికి టీడీపీ సుతారాము తలూపలేదు. కేంద్రంలో బలంతో రాష్ట్రాలను ఆదేశించే స్థాయికి ఎదిగిన బీజేపీ సైతం.. ఎన్డీయే భాగస్వామిగా టీడీపీని చేర్చుకోవటానికి ఒక మెట్టు దిగింది. నిజానికి ఏపీలో బలం పెరగాలని బీజేపీ మదిలో ఉన్నా… టీడీపీతో జత కట్టటమే ఇష్టపడలేదు. కానీ అమిత్ షా, నరేంద్ర మోదీని ఒప్పించటంలో పవన్ కళ్యాణ్ కృషి ఫలించింది.అందుకు ఆయన త్యాగమూ పని చేసింది. సీట్ల ఒడంబడికలో ఎక్కడా తన తూకాన్ని దెబ్బ తీయలేదు. త్యాగం తప్పదని భావించారు. 24 సీట్ల ఒప్పందంపైనే తన సామాజిక వర్గం తీవ్ర ఆవేశంతో ఊగిపోతే.. మరో మూడు సీట్లు బీజేపీకి ఇచ్చి.. తన ఆలోచన శక్తిని నిరూపించారు.

ఇక భీమవరం విషయానికి వస్తే … జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నారు. భీమవరం సంగతేంటీ? ఏపీలో జనసైన్యం గుండెల్ని కదిలించే ప్రశ్ను. ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం కోరింది. ఇది నిజం. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయవద్దని అనలేదు. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం బరిలో నిల్చున్నారు. ఆ ఎన్నికల్లో జనసేనాని వైఎస్సాఆర్సీపీ గ్రంథి శ్రీనివాస్ చేతిలో 8357 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఆ ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్ధి రామాంజనేయులు పులపర్తి (అంజిబాబు)కు 54,036 ఓట్లు రాగా.. పవన్ కళ్యాణ్‌కు 62,285 ఓట్లు వచ్చాయి. కాగా వైసీపీ అభ్యర్ధి గ్రంథి శ్రీనివాస్‌కు 70,642 ఓట్లు వచ్చాయి. కాగా 2024 ఎన్నికల్లో పరిస్థితి వేరుగా ఉంది. టీడీపీ -జనసేన- బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో రాజకీయ సమీకరణలు భిన్నగా మారాయి. ఇప్పుడు అందరి చూపు భీమవరం పైనే ఉంది. తాజాగా రామాంజనేయులు జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో ఇప్పుడు జనసేనాని భీమవరం నుంచి పోటీ చేయరని అందరూ భావిస్తున్నారు. కానీ ఎక్కడ ఓడామో..అక్కడే గెలవాలని భావించే పవన్ కళ్యాణ్ తన కోసం ఎదురు చూస్తున్న భీమవరాన్ని వీడుతారంటే.. అసంబద్ధమే.

పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. గతం మాదిరిగా మాటల్లో ఆవేశం లేదు. ఆలోచనే ఉంది. అభిమాన జనులకు అర్థం అయ్యే రీతిలో ఆయన మేనరిజం మారింది. .. అసలు సిసలు పవనిజం కనిపిస్తోంది. పవర్ స్టార్ అంటే.. తన పవర్ ను చూపిస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. ఆయన మాటల్లోనే గుండాయిజం లోకి దిగితే -నేనే మీ కంటే ‘ పవర్’ పుల్, -కానీ నేను ప్రజాస్వామ్యం పట్ల గౌరవంతో -మౌనంగా భరిస్తున్నా, మీరు …బరితెగిస్తే …నేను దిగుతా …ఆట ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తా , నాకు గెలుపు తెలియదు, -ఓటమి తెలియదు -ప్రయాణమే తెలుసు ..అంటూ తన వాగ్దాటిలో పవనన్న రాటు తేలుతున్నాడనేది యువ జన సైన్యం కితాబు

Advertisement

తాజా వార్తలు

Advertisement