Friday, September 20, 2024

Exclusive – హైడ్రానెవ‌డ్రా ఆపేది .. బిగ్‌బాస్‌కే గున‌పం!

అక్ర‌మార్కుల గుండెల్లో గుబులు
ఎవ్వ‌రైనా స‌రే నో కాంప్రమైజ్
అక్రమ కట్టడాల్ని కూల్చాల్సిందే
చెరువులకు రక్షణ హైడ్రా గొడుగు
నాలాల ఆక్రమణలకు విముక్తి
టార్గెట్ ఫిక్స్ చేసిన క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌
కేటీఆర్ దోస్త్‌ ఫామ్ హౌస్‌పై ఫోకస్
సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ మటాష్
కోర్టులో తేల్చుకుంటామన్న నాగార్జన
చెరువులను ఆక్రమించి పెద్ద పెద్ద నిర్మాణాలు
బడా బాబుల గుండెల్లో హైడ్రా గుబులు

హైడ్రాకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి.. దాని కోరలకు సీఎం రేవంత్ మ‌రింత ప‌దునుపెట్టారు. దీంతో పొలిటిక‌ల్ పార్టీలు, కొంత‌మంది లీడ‌ర్ల‌లో గుబులు రేగుతోంది. ఇందులో బీఆర్ఎస్ నేత కేటీఆర్ దోస్తు ఫామ్ హౌస్‌నూ హైడ్రా వదల్లేదు. హైకోర్టు జోక్యంతో కూల్చివేత‌ల‌కు కాస్త బ్రేక్ పడగా.. ఇప్పుడు బిగ్ బాస్ అక్రమ నిర్మాణం ఎన్ కన్వెన్షన్‌పై గున‌పం దిగింది. రాజకీయ వైరుధ్యాల బారికేడ్లు అడ్డొస్తున్నా సీఎం రేవంత్ హైడ్రా విష‌యంలో జోక్యం చేసుకోవ‌డం లేదు. క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌కు స‌ర్వాధికారాలు ఇవ్వ‌డంతో.. ఆధారాలున్న అక్ర‌మాల‌ అంతుచూడ‌కుండా వ‌దిలేదంటూ ఆయ‌న మ‌రింత దూకుడు పెంచారు.

ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి: కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం సిటీ అంతా ఎక్క‌డ చూసినా హైడ్రా ముచ్చ‌టే వినిపిస్తోంది. జీహెచ్ఎంసీతో పాటు నగర శివార్లలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లోనూ హైడ్రా ఆపరేషన్ పేరు వినిపిస్తోంది. అక్రమ కట్టడాలపై హైడ్రా బుల్డోజర్లు గున‌పాలు దింపుతున్నాయి. చెరువులు, పార్కులు, లే అవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలను అడ్డుకుంటూ అక్రమార్కుల గుండెల్లో హైడ్రా వణుకు పుట్టిస్తోంది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను కాపాడటమే ప్రధాన కర్తవ్యంగా ముందుకు సాగుతున్న హైడ్రా.. ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. అంత‌కాకుండా.. ఆయా ప్రాంతాల్లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై కొరఢా ఝళిపిస్తోంది.

- Advertisement -

నాగార్జున ఎన్‌. కన్వెన్షన్‌కు షాక్

హైదరాబాద్‌ తుమ్మిడి చెరువులో సినీ హీరో నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతను హైడ్రా అధికారులు ప్రారంభించారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేత‌లు చేప‌ట్టింది. నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై కొద్ది రోజుల కిందట హైడ్రాకు ఫిర్యాదు అందింది. తుమ్మిడి చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. దీంతో విచారణ జరిపిన అధికారులు అది ఆక్రమిత స్థలంగా తేల్చుకుని పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు చేప‌ట్టారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరం చెరువులతో నిండి ఉండేది. కానీ సిటీ అభివృద్ధి పేరుతో నగరంలోని అనేక చెరువులు కబ్జాలకు గురయ్యాయి. ఈ క్రమంలోనే 44 ఏళ్ల‌లో అంటే 1979 నుంచి 2023 వరకూ నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 56చెరువుల వివరాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి అందజేసింది. వాస్తవ విస్తీర్ణం.. ప్రస్తుత విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని ఇచ్చింది. దీని ఆధారంగా కబ్జాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది.

ఆక్రమణ నిజమే..

హీరో నాగార్జున నల్ల ప్రీతమ్ రెడ్డితో కలిసి మాదాపూర్‌లో ఎన్3 ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఎన్ కన్వెన్షన్‌‌ను 2015లో నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ ఉంది. నార్త్ ట్యాంక్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివరాల ప్రకారం.. తమ్మిడికుంటలోని ఎఫ్‌టీఎల్ విస్తీర్ణం 29.24 ఎకరాలు. ఎన్ కన్వెన్షన్ ద్వారా ఎఫ్‌టీఎల్‌లో 1.12 ఎకరాలు, బఫర్ జోన్‌లో 2 ఎకరాలు ఆక్రమణలు జరిగాయి. 2014లోనే మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువులోని 1.12 ఎకరాల ఎఫ్‌టీఎల్‌, 2 ఎకరాల బఫర్‌ జోన్‌లో కన్వెన్షన్‌ హాల్‌ ఆక్రమణకు గురైనట్లు సర్వేలో తేలింది.

అప్పట్లో రేకుల షెడ్డునే కూల్చారు

అయితే.. అప్పట్లో చెరువుకు ఎదురుగా ఉన్న ఎన్‌ కన్వెన్షన్‌ హాల్‌లోని షెడ్డును మినహా.. జీహెచ్‌ఎంసీ దేన్ని కూల్చివేయలేదు. కొత్తగా ఏర్పడిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అధికారులు.. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను లక్ష్యంగా చేసుకుని కూల్చివేత మొదలుపెట్టారు.

ఎనిమిది ఏండ్ల కిందటే సీఎం రేవంత్ నజర్

హైదారాబాద్‌లోని హైటెక్ సిటీ రోడ్డులోని ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా టీమ్ నేలమట్టం చేసింది. ఈ అంశం ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది. ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమని.. దానిపై ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని 2016లోనే రేవంత్ రెడ్డి అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పుడు.. ఇప్పుడు ఒకేమాట.. దటీజ్ రేవంత్ అంటూ సోస‌ల్ మీడియాలో పొగడ్తల వర్షం కురుస్తోంది. 2016లో మిషన్ కాకతీయపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా.. చెరువు ఆక్రమణకు గురవుతున్నాయని.. వాటిని కాపాడటానికి ఏం చర్యలు తీసుకున్నారని అప్పుడు ప్రతిపక్షంలోని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు ఉండగా.. కొడంగల్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

సినీ హీరోలు ఆదర్శంగా ఉండాలి..

సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవారు. మంచిని ప్రజలకు బోధించేవారు. వాళ్లను ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది. హైటెక్ సిటీ ఎదురుగా చెరువు భూముల్లో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో.. చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టిండ్రు. కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. ఈ విషయం పదేపదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. టీవీ ఛానెళ్లలో, పేపర్లలో చూపించారు. అక్కినేని నాగార్జున కూడా దీనిపై స్పందించారు. ఈనాటి వరకు కూడా ఎందుకు అక్కినేని నాగార్జున ఆక్రమించుకొని కట్టిన కట్టడాలను తొలగించలేదు. ఏ శక్తులు అడ్డం పడుతున్నాయ్.. ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి సూటిగా సమాధానాం చెప్పాలి’ అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు. అప్పుడు.. ఇప్పుడు ఒకేమాట.. దటీజ్ రేవంత్ అంటూ నెటిజన్లు పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు.

అక్రమార్కుల గుండెల్లో గుబులు..

ఆక్రమణల పర్వంతో హైదరాబాద్ నగరంలో వర్షం పడితే జల దిగ్బంధనం అవుతోంది. చెరువులు ఆక్రమించి విల్లాలు నిర్మించారు. ఇక..పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు ఆక్రమణలతో నిర్మాణాలు చేసారు. ఇప్పుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా అధికారులు తరువాతి టార్గెట్ ఏంటనే చర్చ మొదలైంది. ప్రముఖుల ఫం హౌస్ లు, విల్లాలను ఎక్కడైతే నిబంధనలకు విరుద్దంగా నిర్మించారో వాటి పైన గురి పెట్టినట్లు తెలుస్తోంది. రేవంత్ – హైడ్రా నిర్ణయాలను నెటిజెన్లు ప్రశంసిస్తూ..హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది. ఈక్రమంలో.. పలువురు రాజకీయ నాయకుల కట్టడాలపై కూడా అధికారులు బుల్డోజర్లు ప్రయోగిస్తున్నారు. ఈ స్థితిలో హైదరాబాద్‌ వ్యాప్తంగా.. ఎప్పుడు ఎక్కడ ఏ నిర్మాణాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తారోనన్న ఆందోళన మొదలైంది.

ప్రభుత్వ భూముల్లో రియల్​ గద్దలు..

ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే రియల్ గద్డలు తిష్ట వేశాయి. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ, చెరువు శిఖం భూముల్లో బోర్డులు పెట్టేసి.. వెంచర్లు వేసి నకిలీ పత్రాలు సృష్టించి అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఈ క్రమంలోనే.. స్థలాలు వాళ్లకు తెలియకుండానే.. కొనుగోలు చేసి నిర్మాణాలు కూడా చేపట్టిన దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలోనే.. “మన ఆస్తులు సురక్షితమేనా.. లేదా మనవాటిపైకి కూడా బుల్డోజర్లు వస్తాయా..?” అనే భయం చాలా మందిలో నెలకొంది. హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ” ఇప్పుడు అక్రమార్కుల భరతం పడుతోంది.

చెరువుల పరిరక్షణే ఇంపార్టెన్స్​..

చెరువుల బఫర్‌జోన్‌లలోనూ, నాలాల్ని ఆక్రమించిన చోట్లను గుర్తించి.. అక్కడున్న అక్రమ నిర్మాణాల్ని హైడ్రా టీమ్​ పడగొడుతోంది. జేసీబీలు, బుల్డోజర్లను రంగంలోకి దించి కూల్చివేస్తున్నారు. రాజేంద్రనగర్‌, మియాపూర్‌, కుత్బుల్లాపూర్‌, జూబ్లీహిల్స్‌ ఇలా ఎక్కడైనా సరే.. ఆక్రమణల తొలగింపే లక్ష్యంగా హైడ్రా టీమ్స్‌ యాక్షన్‌లోకి దిగాయి. జీహెచ్ఎంసీ తోపాటు చుట్టుపక్కల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయితీల్లో చాలా చెరువులు 60 శాతం వరకూ కబ్జాకు గురైనట్టు ఇప్పటికే లెక్కలు తేల్చారు. వాటి పరిరక్షణకు యాక్షన్ మొదలుపెట్టారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో కొన్ని భవనాలు కూల్చేశారు. గ్రేటర్ చుట్టుపక్కల పదుల సంఖ్యలో చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా అక్కడ నిర్మించిన భవనాలనూ ఇప్పుడు నేలమట్టం చేస్తున్నారు. పొలిటికల్‌ ఒత్తిళ్లకు తావులేకుండా ఎక్కడైతే ఆక్రమణలు కనిపించాయో వాటిపై కొరడా ఝుళిపిస్తున్నారు.

కోర్టులో తేల్చుకుంటాం: అక్కినేని నాగార్జున

గచ్చిబౌలిలోని తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అక్రమ కట్టడం పేరుతో శనివారం కూల్చివేయడాన్ని హీరో అక్కినేని నాగార్జున తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు హైడ్రా, తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు తమను తప్పుగా అనుకోకుండా ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా చేసిన కూల్చివేతపై కోర్టులోనే తేల్చుకుంటానని వెల్లడించారు. స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అక్కినేని నాగార్జున తన ప్రకటనలో తెలిపారు. తమ ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపేందుకు ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. అదో ఓ పట్టా భూమి అని, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదని నాగార్జున పేర్కొన్నారు. అది ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అన్నారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపైనా కోర్టు స్టే ఇచ్చిందన్నారు.

నాగార్జునకు హైకోర్టులో ఊర‌ట

తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జునకు భారీ ఊరట లభించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. . నేటి ఉదయం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అధికారులు కూల్చివేశారు. . ఈ కూల్చివేతపై నాగార్జున తెలంగాణ హైకోర్టులో లంచ్ మోష‌న్ దాఖ‌లు చేశారు. విచారించిన హైకోర్టు ఈ కూల్చివేతలపై స్టే ఇచ్చింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement