Monday, November 18, 2024

Exclusive – రికార్డుల మోదీ – ఎన్నికల ప్ర‌చారంలో మ‌రో ఫీట్‌

75 రోజులు.. 180 ర్యాలీలు..
220 కార్న‌ర్ మీటింగ్స్.. 111 రోడ్ షోలు
ఇండియా మొత్తాన్ని చుట్టేసిన ప్ర‌ధాని
ప్ర‌చారంలో అంత‌టా న‌రేంద్రుడి సునామీ
మే నెల‌లో ఏకంగా 96 బ‌హిరంగ స‌భ‌లు
మ‌హారాష్ట్ర‌, బెంగాల్‌, బీహార్‌, యూపీపై ఫోక‌స్‌
ద‌క్షిణాది రాష్ట్రాల్లోనూ విస్త్రృత ప్ర‌చారం
నేటితో ముగిసిన ఎన్నిక‌ల ప్ర‌చార ప‌ర్వం
సాయంత్రం నుంచి 24 గంట‌ల‌పాటు ధ్యాన ముద్ర‌
క‌న్యాకుమారిని వేదిక‌గా చేసుకున్న మోదీ

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్‌, హైద‌రాబాద్‌ – లోక్‌సభ ఎన్నికల ప్ర‌చారం ప‌ర్వం గురువారంతో ముగిసింది. దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు ద‌శ‌ల‌లో జరుగుతున్న ఈ ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికే ఆరు ద‌శ‌ల పోలింగ్ పూర్తి అయింది.. చివ‌రిది, ఏడో ద‌శ పోలింగ్ జూన్ ఒక‌టో తేదీన జ‌ర‌గ‌నుంది. దీనిలో భాగంగా నేటితో ఆఖ‌రి ద‌శ ప్ర‌చారానికి తెర ప‌డింది. ఈ ఎన్నికలతో హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న బీజేపీ ప్రచారంలోనూ అదే దూకుడు చూపింది. ఇందులో భాగంగా బీజేపీ త‌రుపున ఆ పార్టీ కీల‌క నేత‌, ప్రధాని మోదీ విస్తృత పర్యటనలు చేశారు. ఒక్కో రోజు మూడు నుంచి ఐదు సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్ప‌టి నుంచి ఈ రెండున్నర నెలల్లో మోదీ దాదాపు 180 ర్యాలీలు నిర్వహించారు.

మే నెలలోనే 96 సభలు..

ఈ ఏడాది మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. అప్పటి నుంచి బీజేపీ ప్రచార వేగాన్ని పెంచింది. ఈ 75 రోజుల్లో మోదీ దేశం నలుమూలలా ర్యాలీలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. 22 రోజుల పాటు నిత్యం నాలుగు చోట్ల ప్రచారాలు చేపట్టారు. మూడు పర్యాయాలు అయితే ఒక్క రోజులోనే ఐదేసి సభలు నిర్వహించారు. మే నెలలోనే ప్రధాని 96 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆ నాలుగు రాష్ట్రాలపై గురి..

ప్రధాని మోదీ చేపట్టిన ప్రచారాల్లో దాదాపు సగం ర్యాలీలు కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే ఉండటం విశేషం. 80 మంది ఎంపీలను ఎన్నుకునే ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 31 సభలు నిర్వహించారు. ఆ తర్వాత బిహార్‌పై దృష్టిపెట్టిన ప్రధాని ఆ రాష్ట్రంలో 20 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇక, మహారాష్ట్రలో 19, పశ్చిమబెంగాల్‌లో 18 ప్రచార కార్యక్రమాలు నిర్వ‌హించారు. 2019తో పోలిస్తే మహరాష్ట్రలో ఈసారి మోదీ రెట్టింపు స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు. మొత్తంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి 88 ర్యాలీల్లో పాల్గొన్నారు.

దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి..

ఈ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలని చూస్తున్న కమలదళం ప్రచారంలోనూ ఆ దిశగా వ్యూహాలు అమలు చేసింది. ఇక్కడి ఐదు రాష్ట్రాల్లో ప్రధాని 35 ర్యాలీలు నిర్వహించారు. అత్యధికంగా కర్నాటక, తెలంగాణలో 11, తమిళనాడులో 7 సార్లు ప్రచారం సాగించారు. కర్నాటకలో గత ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకుంది. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో మోదీ ప్రత్యేక దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

గుజ‌రాత్‌లోనూ..

సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రధాని ఐదు ర్యాలీలు చేపట్టారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజు జనతా దళ్‌తో పొత్తు కుదరకపోవడంతో ఆ రాష్ట్రంపైనా బీజేపీ ఫోక‌స్ పెట్టింది. అక్కడ మోదీ 10ప్రచార స‌భ‌లు నిర్వహించారు. పూరీలో చేపట్టిన భారీ రోడ్‌ షోకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అటు మధ్యప్రదేశ్‌లో 10, జార్ఖండ్‌లో 7, రాజస్థాన్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు, హరియాణాలో మూడు ర్యాలీలు నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లోనూ ప్రధాని ఓసారి పర్యటించారు. చివ‌రి రోజైన గురువారం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో బహిరంగ సభలో పాల్గొని కాంపైన్ కు తెర‌దించారు.. మొత్తం మీద మోదీ ఈ 75 రోజుల్లో 180 ర్యాలీలు.. 220 కార్న‌ర్ మీటింగ్స్.. 111 రోడ్ షోల‌లో పాల్లొని ప్ర‌చార సునామీనే సృస్టించారు. ఇవే గాక, పలు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలిచ్చారు.

ఇక ధ్యాన ముద్ర‌లో మోదీ…

సార్వత్రిక ప్రచారం ముగియ‌డంతో ఆయ‌న పంజాబ్ హోషియాపూర్ నుంచి నేరుగా ప్ర‌త్యేక విమానంలో క‌న్యాకుమారి చేరుకున్నారు. అక్క‌డ ఇవ్వాళ‌ సాయంత్రం నుంచి 24 గంటల పాటు మోదీ నిరవధిక ధ్యాన దీక్ష చేప‌ట్టనున్నారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌ వేదిక చేసుకున్నారు. జూన్ 1 వరకు అదే విధంగా ధ్యాన మండపంలో ధ్యానం చేస్తారని, ఈ 24 గంటల పాటు ధ్యానంలోనే ఉంటారని, ఆ సమయంలో ఎవరినీ పలకరించను కూడా పలకరించరని బీజేపీ నేత‌లు చెప్పారు.

ఇదే తొలిసారి కాదు..

ఇలా 24 గంటలు ధ్యానం చేయడం మోదీకి ఇది తొలిసారి కాదు. 2019 ఎన్నికల ప్రచారం తర్వాత కూడా కేదార్‌నాథ్ గుహలో ధ్యానం చేశారు. ఈ నేపథ్యంలోనే కన్యాకుమారిలో మోదీ ధ్యానం చేయనుండటంపై పార్టీ నేతలు స్పందించారు. ధ్యానం చేయడానికి మోదీ కావాలనే ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నారని తెలిపారు. దేశంపై వివేకానందకు ఉన్న విజన్‌ను ఫలవంతం చేయడంలో తన నిబద్దతను చూపడానికే ఆ ప్రాంతాన్ని ఎన్నికున్నారని వివ‌రించారు.

ఈ ప్రాంతం చాలా పవిత్రం

ప్రధాని మోదీ 24 గంటల పాటు ధ్యానం చేప‌ట్టిన‌ వివేకానంద రాక్ మెమోరియల్‌కు మన పురాణాలు, చరిత్రలో కూడా చాలా ప్రత్యేక స్థానం ఉంది. శివుడి కోసం ఎదురుచూస్తూ పార్వతీ దేవి ఒకే పాదంపై ధ్యానం చేశారు. అది కన్యాకుమారిలోనే అని పురాణాలు చెప్తున్నాయి. ఈ ప్రాంతానికి గౌతమ బుద్దుడి జీవితంలో కూడా కీలక పాత్ర ఉందని తెలుస్తోంది. దేశమంతా తిరిగిన త‌ర్వాత మూడు రోజులు ధ్యానం చేయడానికి వివేకానంద ఇక్కడికే వచ్చారని, ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడే ఆయనకు అభివృద్ధి చెందిన భారతదేశం విజన్ కనిపించిందని ప‌లువురు చెబుతుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement