Sunday, November 10, 2024

Exclusive – హైడ్రా! మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్‌..

ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు సుస్సు ప‌డాల్సిందే
259 మందితో స్పెష‌ల్‌ టీమ్
ప్ర‌భుత్వ స్థ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌.. విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌లో కీల‌కం
బ‌డ్జెట్‌లో ₹200 కోట్ల కేటాయించిన స‌ర్కారు
ఐజీ స్థాయి సీనియ‌ర్ ఆఫీస‌ర్‌కు బాధ్య‌త‌లు
ఏవీ రంగ‌నాథ్‌కు విస్తృత అధికారాలిచ్చిన సీఎం రేవంత్‌
ప్ర‌త్యేక పోలీసు స్టేష‌న్ ఏర్పాటుకు చ‌ర్య‌లు
పోలీసు, రెవెన్యూ, నీటిపారుద‌ల శాఖలతో మ‌మేకం
ఇత‌ర అన్ని శాఖ‌ల నుంచి సిబ్బంది కేటాయింపు
గ్రౌండ్ లెవ‌ల్‌లో విజిలెన్స్‌కు చాన్స్‌
స‌ర్కారు స్థ‌లం క‌బ్జాపెడితే ద‌బిడిదిబిడే

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌:
హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా క్రమంగా బలపడుతోంది. ప్రభుత్వం కూడా హైడ్రాపై ప్రత్యేక దృష్టి సారించి ఆ సంస్థకు కావాల్సిన వనరులన్నీ సమకూర్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఇప్పటికే ఐజీ స్థాయి అధికారి రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించింది. విస్తృత అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక వ్యవస్థగా హైడ్రా పనిచేయబోతున్నట్లు శాసనసభలో అధికారికంగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, సర్కారు భూములపై కన్ను పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -

హైడ్రాకు బడ్జెట్​లో 200 కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా అవసరమైన మానవ వనరులను సమకూరుస్తామని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, ప్రత్యేక పోలీస్ స్టేషన్‌తోపాటు సిబ్బందికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ సహా అన్ని విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై సిబ్బందిని కేటాయించాలని కోరారు. హైడ్రా ప్రతిపాదనలను పరిశీలించిన పురపాల శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పోలీసు బలగాలకు సంబంధించిన కేటాయింపులపై డీజీపీకి లేఖ రాశారు.

ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్
నలుగురు ఎస్పీలు, ఐదుగురు డీసీపీలు, 21 మంది ఇన్​స్పెక్టర్లు, 33 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు ఆర్ఐలు, 12 మంది ఆర్ఎస్ఐలు, 101 మంది కానిస్టేబుళ్లు, 72 మంది హోంగార్డులు, ముగ్గురు ఎనలైటికల్ ఆఫీసర్లు సహా మరో ముగ్గురు సహాయ ఎనలైటికల్ ఆఫీసర్లను డిప్యుటేషన్‌పై హైడ్రాకు కేటాయించాలని కోరారు. మూడు కమిషనరేటర్ల పరిధిలో హైడ్రా సమర్థంగా పనిచేయాలంటే తగిన సిబ్బంది ఉండాలని సూచించారు.

గ్రౌండ్ లెవ‌ల్‌లో విజిలెన్స్‌..

జీహెచ్ఎంసీతోపాటు ఓఆర్ఆర్ వరకు 2 వేల 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేయనున్నట్లు వెల్లడించిన రంగనాథ్, ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఆక్రమణలపై ఫిర్యాదులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విజిలెన్స్ చేసేందుకు కూడా ప్రత్యేక బృందాలను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం హైడ్రాకు సిబ్బందిని కేటాయించేందుకు ఆయా విభాగాల్లోని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement