Thursday, November 21, 2024

Exclusive – క‌ల్లాలే వద్దే స్పాట్‌ పేమేంట్‌! ప్రైవేటు వ్యాపారుల వైపే రైతుల మొగ్గు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌ :ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన‌ ప్రైవేటు వ‌ర్త‌కుల‌కు ధాన్యం విక్ర‌యించ‌డానికి రైతులు ఎదురు చూస్తున్నారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల‌కు దూర‌మ‌వుతున్నారు. తేమ శాతం త‌క్కువ‌గా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల‌కు తీసుకు రావాల‌ని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.

అలాగే తేమ శాతం త‌క్కువ‌గా ఉంటేనే మ‌ద్ద‌తు ధ‌ర ల‌భిస్తోంద‌ని కేంద్ర నిర్వ‌హ‌కులు చెబుతున్నారు. నిజామాబాద్‌, కామ‌రెడ్డి, నిర్మ‌ల్‌, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, మెద‌క్, సిద్ధిపేట త‌దిత‌ర జిల్లాల్లో వ‌రి కోత‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు కూడా రైతుల‌కు అనుకూలంగా లేవు. ఎప్పుడు వ‌ర్షం ప‌డుతుందో? ఒక వేళ వ‌ర్షం ప‌డితే ధాన్యం త‌డిసిపోయే అవ‌కాశం ఉంటుంద‌ని, అప్పుడు త‌డి ధాన్యం కొనుగోలు చేసే ప‌రిస్థితి ఉండ‌ద‌న్న ఆందోళ‌న‌లో రైతాంగం ఉంది.

ఒక వేళ తడి ధాన్యం ఉన్నా.. న‌ష్టానికి అమ్మ‌వ‌ల‌సి ఉంటోంద‌ని రైతులు భావిస్తున్నారు. అందుకే పంట చేతికి వ‌చ్చిన వెంట‌నే అమ్మితే లాభదాయ‌కంగా ఉంటుంద‌ని రైతులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. క‌ల్లాలు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి కొనుగోలు చేసి స్పాట్ పేమెంట్ ఇవ్వ‌డంతో డ‌బ్బులు కోసం కూడా ప‌దేప‌దే తిర‌గ‌వ‌ల‌సి ఉండ‌ద‌ని రైతులు చెబుతున్నారు.

. అందుకే కొనుగోలు కేంద్రాల కంటే ప్రైవేటు వ‌ర్త‌కుల‌కు ధాన్యం విక్ర‌యించ‌డానికి రైతులు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ప్రైవేటు వ‌ర్త‌కుల కోసం ఎదురు చూపు…రాష్ట్రంలో వరి కోతలు మొదలయ్యాయి. వ‌రి పంట కూడా క‌ల్లాల‌కు చేరుతోంది. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియ‌క‌పోవ‌డంతో నూర్పిడి అయిన వెంట‌నే ధాన్యం విక్ర‌యించ‌డానికి రైతులు ఆస‌క్తి చూపుతున్నారు.

- Advertisement -

అందుకే తేమ శాతంతో ప‌నిలేకుండా కొనుగోలు చేస్తున్న వ్యాపారుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గ‌తంలో లాగే ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వ్యాపారులు ధాన్యం కొనుగోలుకు రాష్ట్రంలో తిరుగుతున్నారు. ఈ విష‌యం గ‌మ‌నించిన రైతులు వ్యాపారుల‌ను సంప్ర‌దించి ధాన్యం విక్ర‌యిస్తున్నారు. ఇదీలా ఉండ‌గా పొరుగున‌ ఉన్న రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కోతలకు ముందే ఇక్కడికి చేరుకుని, రైతులతో ఒప్పందాలు చేసుకుని ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.

కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు తేమ ఎక్కువ‌గా ఉన్న‌ ధాన్యం కూడా కొనుగోలు చేస్తారు. అలాగే మహారాష్ట్ర నుంచి కూడా కొనుగోలుకు వస్తున్నారు. ఆయా వ్యాపారులకు ధాన్యం విక్ర‌యించ‌డం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. క్వింటా ధాన్యం ₹2200 ధ‌ర‌కు కొనుగోలుతేమ శాతం బాగా త‌క్కువ‌గా ఉన్న ధాన్యం (మొదటి రకం) క్వింటాకు ₹2330, రెండో రకం ₹2300 ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ధ‌ర చెల్లిస్తోంది. అలాగే సన్నాలకు అదనంగా ₹500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. అయితే ర‌బీలో బోన‌స్ ఇవ్వ‌లేదు. ఈ ఏడాది ఖ‌రీఫ్‌కు ఇస్తుందా, లేదా అనే విషయంలో రైతుల‌కు స్పష్టత లేదు. అయితే.. ఇత‌ర రాష్ట్రాల వ్యాపారులు తేమ శాతం ప‌ట్టించుకోకుండా ధాన్యం క్వింటాకు ₹2100 నుంచి ₹2200 వరకు చెల్లిస్తున్నారు.

ప్రభుత్వ మద్దతు ధర కంటే రెండు, మూడు వందలు తక్కువ అయినప్పటికీ లాభదాయకంగా ఉంటుందని పలువురు రైతులు తెలిపారు. కల్లాల వద్దే కొనుగోలుకల్లాల వద్దకు వ్యాపారులు వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కోతల సమయంలోనే వ్యాపారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం కల్లాల దగ్గరకు, పొలాల దగ్గరకు లారీలు, గోనె సంచులతో చేరుకుంటారు. నూర్పిడి అయిన వెంటనే ఆర బెట్టకుండానే బస్తాల్లో నింపుకుని, తూకం వేసి లారీల్లో లోడ్ చేసుకుని తరలిస్తారు. తూకం వేసి బస్తాలో నింపడమే రైతుల పని. కొనుగోలు చేసిన ధాన్యానికి తగిన డబ్బులు కూడా వెంటనే చెల్లిస్తారు.

దీంతో రైతులకు ధాన్యం ఆర బెట్టే శ్రమ తప్పుతున్న‌ది. వ్యాపారులు కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు చేయడం వల్ల రవాణా చేసే బాధ్యత ఉండదు. దీనివల్ల రైతులకు ఎంతో శ్రమ తగ్గుతుంది. అలాగే తేమ ఎక్కువ శాతం ఉన్న‌ ధాన్యానికి, ఆర‌బెట్టిన‌ ధాన్యానికి తూకం మధ్యలో క్వింటాకు ఆరు నుంచి ఎనిమిది కిలోల తేడా ఉంటుంది. దీనివల్ల రైతుకు లాభం చేకూరుతుంది. ధాన్యం విక్రయించిన వెంటనే డబ్బులు చేతికి అందుతాయి. ఇలాంటి ఉపయోగాలు ఉండడం వల్ల రైతుల తమ దగ్గరకు వచ్చిన వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement