Monday, November 18, 2024

Exclusive – సబర్మతి సజీవ నాదం..! మూసీ కాలుష్య రూపమా

మోడీ అస్త్రాన్నే తిప్పికొడుతున్న రేవంత్‌రెడ్డి-

గుజరాత్‌లో రివర్‌ఫ్రంట్‌కు ప్రాణం పోసిన మోడీ-

తెలంగాణలో రేవంత్‌ యాక్షన్‌ప్లాన్‌కు అడ్డంకులు-

డ్రయినేజ్‌ నుంచి సజీవ నదిగా సబర్మతికి ప్రాణం-

మూసీ కాలుష్య కాసారంలోనే పేదల బతుకులు- రివర్‌ ఫ్రంట్‌ ఏర్పాటుతోనే మూసీకి మోక్షం-

- Advertisement -

టూరిజం హబ్‌గా మారితే ఉపాధి కేంద్రమే-

తెలంగాణకు ఆర్ధికంగా వెన్నెముకే!

– పేదలు, మేధావి వర్గాలను ఆకర్షిస్తున్న ప్రాజెక్టు

…సబర్మతి నది… 2001… నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ… సబర్మతి నదికి ఇరువైపులా రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలు ఇళ్ల వంటి నాలుగడుగుల గూళ్లు ఏర్పాటు చేసుకుని దయనీయస్థితిలో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితిని కళ్లారా చూసిన మోడీ చలించిపోయారు. వెంటనే సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ పథకానికి శ్రీకారం చుట్టారు. వేలాది కోట్లను కేటాయించారు. పేదలకు పక్కా ఇళ్లు కేటాయించి అక్కడికి తరలించారు. బఫర్‌జోన్‌లో ఉన్న పట్టా భూములను సేకరించారు. ప్రణాళికను అమలు చేశారు. సరిగ్గా దశాబ్దకాలం గడిచేసరికి అంటే, 2011 నాటికి ప్రపంచంలోనే అత్యంత సుందరమైన, పొడవైన సబర్మతీ రివర్‌ ఫ్రంట్‌ను ఆవిష్కరించారు. ప్రస్తుతం… దేశంలోనే కాదు ప్రపంచాన్ని కూడా విశేషంగా ఆకర్షిస్తున్న పర్యాటక కేంద్రంగా సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ కళ్ల ముందు ఉంది. నదికి ఇరువైపులా కారిడార్లతో సకల సౌకర్యాలతో అలరారుతోంది!

మూసీ నది… 2024… నేటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి… రాష్ట్రంలోనే అత్యంత మురికి కూపంగా మారిన మూసీ నదిని, నదీ గర్భంలోనే పిచ్చుక గూళ్ల వంటి ఇళ్లను, అందులో దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్న పేదలను గమనించి కదిలిపోయారు. మొత్తం భాగ్యనగరం నుంచి వెలువడుతున్న డ్రెయిన్లన్నీ మూసీలోనే కలిసి అక్కడి జనాన్నే కాకుండా, దిగువన ఉన్న నల్లగొండ జిల్లాను కలుషితం చేసి ప్రజారోగ్యాన్ని, పంట పొలాలను సర్వనాశనం చేస్తుండడంతో, ఎలాగైనా సరే మూసీని మరో కృష్ణ, గోదావరి నదుల్లా సజీవ నదిగా మార్చాలన్న దృఢమైన సంకల్పాన్ని తీసుకున్నారు.

అక్కడి పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు తరలించి ఆపరేషన్‌ మూసీ పేరుతో సబర్మతిని మించిన రివర్‌ ఫ్రంట్‌తో ప్రపంచ టూరిస్ట్‌ కేంద్రంగా రూపొందించాలని నిర్ణయించుకున్నారు. అయితే, నాడు మోడీని పొగిడిన నోళ్లు నేడెందుకు రేవంత్‌ను తెగుడుతున్నాయి?

(న్యూస్‌ నెట్‌వర్క్‌ ఇన్‌చార్జ్‌)

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:

రాజకీయం అంటే… నాడు ప్రజా సేవ! …సమాజాభివృద్ధి! …దేశ ప్రగతి! నేడు… అధికారం కోసం కీచులాట! పదవుల కోసం కొట్లాట! ఇందుకు తాజా ఉదాహరణ సబర్మతి, మూసీ రివర్‌ ఫ్రంట్‌ పథకాలు! మిలీనియంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోడీ సబర్మతి నది దుస్థితిని, అక్కడ నివశిస్తున్న జనం దుర్భర పరిస్థితులను గమనించి గుండె తరుక్కుపోయి ఆపరేషన్‌ సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ను చేపట్టారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినా వెనుకాడలేదు. పేదలను ప్రణాళిక ప్రకారం పక్కా గృహాలు కేటాయించి, వారికి ఉపాధి కల్పించారు. బఫర్‌ జోన్‌లో ఉన్న పట్టా భూములను సేకరించారు. ప్రపంచ స్థాయిమౌలిక వసతులతో అత్యంత సుందరంగా సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ను సరిగ్గా దశాబ్దకాలంలో ఆవిష్కరించారు. ఏకంగా నర్మద డ్యామ్‌ నుంచి సబర్మతి నదిని అనుసంధానం చేశారు. దీంతో సబర్మతి సంవత్సరంలో అన్ని రోజులూ నిండుగా, స్వచ్ఛతకు మారుపేరుగా ప్రవహిస్తోంది. నేడు గుజరాత్‌కు ఇదే ప్రాజెక్టు టూరిజం వెన్నెముకగా నిలిచింది.

ఎన్నో విమర్శలు గుప్పించిన ప్రత్యర్ధులు మోడీని విజనరీగా వేనోళ్ల పొగిడారు. ఇలా మోడీ గుజరాత్‌ను మోడల్‌ స్టేట్‌గా మార్చడానికి ఎన్నో కఠినాతికఠిన నిర్ణయాలు తీసుకుని పలు ప్రాజెక్టులను పూర్తి చేశారు. అందుకే ఆయన నిరాఘాటంగా గుజరాత్‌ను 15 సంవత్సరాలు పరిపాలించి దేశ ప్రజలను విశేషంగా ఆకర్షించగలిగారు. అభివృద్ధి మోడల్‌గా మార్చిన మోడీని దేశ ప్రజలంతా ప్రధానిగా చూడాలనుకున్నారు. దశాబ్దం క్రితమే ఆయన్ని ప్రధానిని చేశారు.

అయితే, పీతల బుట్ట సామెత వలె ఎంతో మంది ఆయన్ని ఇంటా, బయటా తొక్కేయడానికి విఫల ప్రయత్నాలు చేశారు. కాని, సంకల్పం, దృఢ నిశ్చయం ఆయన్ని కవచంగా కాపాడాయి. ఎన్ని విమర్శలు ఉన్నా ఆయన తిరుగులేని ప్రజా నాయకుడిగా నేటికీ జనం మదిలో కొలువై ఉండిపోయారు!

తెలంగాణ… ఎన్నో ఏళ్ల మొక్కవోని ఉద్యమాలతో దద్దరిల్లి ఎట్టకేలకు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. దేశంలోనే అతి పిన్న వయసు గల రాష్ట్రమైనప్పటికీ, అత్యంత సహజ వనరులు, ఆధునిక మౌలిక సదుపాయాలు ఉండడంతో సంపన్న రాష్ట్రంగా వర్ధిల్లుతోంది. అయితే, నాణనికి రెండో వైపన్నట్టు… ఇంతటి అబ్బుర రాష్ట్రానికి ఒకే ఒక్క మచ్చ భయంకరంగా ఉండిపోతోంది…

అదే మూసీ! నగరం నడిబొడ్డు నుంచి ప్రవహిస్తోంది. ఒకప్పుడు మంచినీటితో నిరంతర ప్రవాహంతో సజీవ నదిగా ఉన్న మూసీ నేడు అదే ఆధునిక సమాజం వికృత పోకడలకు అద్దం పడుతోంది. మొత్తం నగరం మురికినీరంతా మూసీలో కలిసి ప్రవహిస్తోంది. దేశంలో సజీవ నదుల పేర్లను మన ఆడపడుచులకు పెట్టుకుంటాం… అదే మన నగరం నడిబొడ్డున ప్రవహిస్తున్న మూసీ నది పేరును మన పిల్లలకు ఎందుకు పెట్టుకోలేకపోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వేసిన ప్రశ్నకు నిజంగానే ఎవరి వద్దా సమాధానం లేదు!

మన నట్టింటో మనమే మలమూత్రాలను విసర్జిస్తున్నామనడానికి మూసీ ప్రత్యక్ష తార్కాణం! పైగా ఇదే మూసీ నది గర్భంలో ఇరుకుగదుల్లో నిరుపేద కుటుంబాలు మరింత దుర్భరంగా జీవిస్తున్నాయి. ఈ పరిస్థితులను కళ్లారా చూసి హృృదయం ద్రవించిన ముఖ్యమంత్రి రేవంత్‌, దీన్నెలాగైనా మార్చాలన్న ఉక్కు సంకల్పంతో ప్రణాళికలు రచించారు. ఆపరేషన్‌ మూసీ చేపట్టారు.

పేదలను డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు తరలించి, పట్టాభూములకు పరిహారం చెల్లించి, నదికి ఇరువైపులా రెండు కారిడార్లను నిర్మించి, ప్రపంచంలోనే అత్యంత సుందరమైన రివర్‌ఫ్రంట్‌గా రూపొందించడానికి యాక్షన్‌ప్లాన్‌తో రంగంలోకి దిగారు. తెలంగాణ టూరిజానికే కాకుండా ప్రపంచ పర్యాటక హబ్‌గా మార్చాలని నిర్ణయించారు. అంతే! రాజకీయాలు మొదలయ్యాయి. నాడు మోడీ చేపట్టిన ప్రాజెక్టునే నేడు మూసీ రూపంలో చేపడితే ఎందుకు విమర్శలు ఎదురవుతున్నట్టు?! ప్రజలే అర్ధం చేసుకోవాలి!!

ఎంత మహత్తర కార్యక్రమమైనా ఆరంభ శూరత్వంతో వ్యవహరిస్తే నీరుగారిపోతుంది. నాడు సబర్మతి రివర్‌ఫ్రంట్‌ ఏర్పాటులో కూడా నరేంద్ర మోడీ నేటి తరహా విమర్శలనే మరింత దారుణంగా ఎదుర్కొన్నారు. అయినా మొక్కవోని దీక్షతో కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగారు. కాగా, నేడు సరిగ్గా అదే పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఎదురైంది. ముఖ్యంగా భాజపా రాష్ట్ర నేతలు తూర్పారపట్టడం ప్రారంభించారు.

కాని, ఉక్కు సంకల్పంతో ఉన్నానని చాటి చెబుతూ సీఎం రేవంత్‌ ఎదురుదాడి ప్రారంభించారు. నాడు గుజరాత్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి అందరి మన్ననలను అందుకున్న మోడీ నేడు అదే భాజపా నేతగా ప్రధాని పదవిలో ఉన్నారు. దీన్నే రేవంత్‌ తన ప్రధాన అస్త్రంగా నేడు ఎంచుకున్నారు. ఇదే ఉదాహరణను గుర్తు చేస్తూ, భాజపా రాష్ట్ర నేతలకు చిత్తశుద్ధి ఉంటే అందరం కలిసి ప్రధాని వద్దకు వెళ్లి మూసీ రివర్‌ఫ్రంట్‌కు 25 వేల కోట్ల ఆర్ధిక సాయం అడుగుదామని ప్రతిపాదించారు. కేంద్రం నిధులు ఇస్తే మరింత వేగంగా రివర్‌ఫ్రంట్‌ రూపుదిద్దుకుంటుందని, టూరిజం హబ్‌గా మారి ఉపాధి కేంద్రంగా తయారవుతుందని చెబుతున్నారు.

పైగా, మూసీలో పేదలు జీవితాంతం, తరతరాలు ఇలాగే మురికి కూపంలో బతకాలా అని నిలదీస్తున్నారు. దిగువన ఉన్న నల్లగొండ జిల్లా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రండి… అందరం కలిసి పేదల బతుకుల్లో వెలుగులు నింపుదామని చెబుతుండడంతో విపక్షాల్లో అలజడి నెలకొంది. ముఖ్యంగా, భాజపా నేతల్లో ఆత్మశోధన మొదలైంది. రాజకీయమంటే, జనం జీవితాలను మెరుగు పరచడమేనన్న రేవంత్‌ సరికొత్త నిర్వచనం సామాజిక, రాజకీయ, ఆర్థికవేత్తలను, మేధావులను ఆకర్షిస్తోంది! ఆపరేషన్‌ మూసీతో తొలుత సమాజంలో కొంత ఆందోళన మొదలైనా… నెమ్మదిగా సర్దుమణుగుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు!

Advertisement

తాజా వార్తలు

Advertisement