Wednesday, October 9, 2024

Exclusive – జంపింగ్‌ల‌పై డ‌బుల్ గేమ్‌!

రాష్ట్రానికో తీరు.. కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌ల జోరు
కాంగ్రెస్ పెద్ద‌ల‌ది ద్వంద్వ నీతి
రాష్ట్రానికో నిర్ణ‌యం ఉంటుందా?
హై క‌మాండ్ తీరుపై ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌
గోవా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో అభ్య‌ర్థుల‌పై వేటు
తెలంగాణ‌లో మాత్రం చేరిక‌ల‌కు ప్రోత్సాహం
ఫిరాయింపుదారుల చ‌ట్టం తీసుకొచ్చేంది కాంగ్రెస్‌
హైక‌మాండ్‌ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అభాసుపాలు
తెలంగాణ హైకోర్టుకు చేరిన ఫిరాయింపుల వ్య‌వ‌హారం
అన‌ర్హ‌త పిటిష‌న్లు దాఖ‌లు చేసిన బీఆర్ఎస్ లీడ‌ర్లు
స్పీకర్ కార్యాల‌యం కార్య‌ద‌ర్శికి హైకోర్టు నోటీసులు

ఆంధ్రప్రభ స్మార్ట్​, సెంట్రల్​ డెస్క్​: కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఫిరాయింపుదారుల చ‌ట్టం ఆ పార్టీనే అభాసుపాలు చేస్తోంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఫిరాయింపుల విష‌యంలో రాష్ట్రానికొక తీరుగా కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక జాతీయ పార్టీ ఇట్లా చేయడం క‌రెక్టు కాద‌ని ప‌లువురు కాంగ్రెసేత‌ర పార్టీల నేత‌లు అంటున్నారు. ఇటీవ‌ల తెలంగాణ‌లో జ‌రిగిన ఫిరాయింపుల వ్య‌వ‌హ‌రంలో, హిమ‌చ‌ల‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ఫిరాయింపుల వ్య‌వ‌హ‌రంలో కాంగ్రెస్ శైలిలో వ్య‌త్యాసం క‌నిపించింది. ఫిరాయింపుదారుల‌కు పింఛ‌న్‌, ఇత‌ర అల‌వెన్స్‌లు కూడా ర‌ద్దు చేయాల‌ని హిమాచ‌ల‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ఒక చ‌ట్టం కూడా తీసుకువ‌చ్చారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ‌లో మాత్రం కోర్టు తీర్పును సైతం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక‌.. ఈ తీర్పును కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా ప‌క్క‌దారుల‌ను వెతుకుతుండ‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు దారితీసింది.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ప‌ది మంది వ‌ల‌స‌

- Advertisement -

బీఆర్ఎస్ బీఫారం ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్‌రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ కాంగ్రెస్‌లోకి చేరారు. కాంగ్రెస్ కండువా క‌ప్పుకుని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి, అప్ప‌టి పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న‌ రేవంత్ రెడ్డి సార్థ్యంలో పార్టీలో చేరారు. వారి బాట‌లోనే మ‌రో ఏడుగురు ఎమ్మెల్యేలు ప‌య‌నించారు. ఈ క్ర‌మంలో ఫిరాయింపుదారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శాస‌న‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిరాయింపుదారుల‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఒక అడుగు ముందుకు వేసి హైకోర్టును ఆశ్ర‌యించారు.

లోక్‌స‌భ ఎన్నిక‌లకు ముందు..

లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేశారు. ఆయన బాటలోనే మరో తొమ్మిది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. అయితే.. వీరిని అన‌ర్హులుగా ప్ర‌క‌టించాల‌ని స్పీకర్‌కు బీఆర్‌ఎస్ అనర్హత పిటిషన్‌లు దాఖలు చేసినప్పటికీ, ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేసే పద్ధతులను అవలంభిస్తోంది. దీంతో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆకేల‌పూడి గాంధీపై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ జాగ్ర‌త్త ప‌డింది. ప్ర‌తిప‌క్షానికి ఇవ్వాల్సిన ప‌బ్లిక్ అకౌంట్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌విని గాంధీకి క‌ట్ట‌పెట్టింది. దీనిపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే జ‌రిగింది.

ముగ్గురిపై అన‌ర్హ‌త వేటు కోసం..

ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్‌రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ హైకోర్టులో బీఆర్ఎస్ పిటీష‌న్ దాఖ‌లు చేసింది. ఈ పిటీష‌న్‌ను స్పీకర్‌ ముందు ఉంచాలని రాష్ట్ర శాసనసభ కార్యదర్శిని హైకోర్టు సెప్టెంబర్‌ 9న ఆదేశించింది. నాలుగు వారాల్లోగా ఏమీ చ‌ర్య‌లు తీసుకున్నారో షెడ్యూల్‌తో కూడిన స్టేటస్ రిపోర్ట్‌ను హైకోర్టు రిజిస్ట్రార్‌కు తెలియజేయాల్సి ఉంటుందని, అలా చేయని పక్షంలో కోర్టు ఈ కేసును తిరిగి విచారణకు తీసుకుంటుంద‌ని కోర్టు తెలిపింది. నాలుగు వారాల గడువు సమీపిస్తున్న తరుణంలో.. సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి గత వారం హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ ఆరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించి తదుపరి విచారణను అక్టోబర్‌ 24కి వాయిదా వేసింది. కాగా, హైకోర్టు ఉత్త‌ర్వుల‌తో ఫిరాయింపులు నిలిచిపోయాయ‌ని చెప్పొచ్చు.

ప్ర‌జాశాంతి పార్టీ మ‌రో పిటీష‌న్‌

పార్టీ ఫిరాయింపు చేసిన ప‌ది మంది ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మ‌రో పిటీష‌న్ దాఖలు చేశారు. ఈ క్ర‌మంలో అసెంబ్లీ కార్యదర్శి, భారత ఎన్నికల సంఘంతో పాటు పార్టీ మారిన ప‌ది మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్‌లో ఇలా..

ఈ ఏడాది ప్రారంభంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో బీజేపీలోకి ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అధికార కాంగ్రెస్ అనర్హత వేటు వేసింది. సెప్టెంబరులో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఫిరాయించిన శాసన సభ్యుల పెన్షన్ ప్రయోజనాలను రద్దు చేయడానికి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఒక చట్టాన్ని కూడా తీసుకువచ్చింది.

గోవాలో కూడా..

గోవాలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించారు. బీజేపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు రెండేళ్లు పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో గత నెలలో కాంగ్రెస్ నిరసనలు నిర్వహించింది. వారిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని డిమాండ్ చేసింది.

రాష్ట్రానికో తీరు.. హైక‌మాండ్ తీరుపై విమ‌ర్శ‌లు..

కాంగ్రెస్ జాతీయ పార్టీ అనే విష‌యాన్ని మ‌రిచిపోయి రాష్ట్రానికో విధంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. తెలంగాణ‌లో పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించిన కాంగ్రెస్‌, హిమ‌చ‌ల్‌ప్ర‌దేశ్‌లో ఫిరాయింపుదారుల‌పై వేటు వేసింది. అలాగే.. పెన్ష‌న్ ప్ర‌యోజ‌నాలను ర‌ద్దు చేస్తూ అసెంబ్లీలో కొత్త చ‌ట్టాన్ని కూడా తీసుకు వ‌చ్చింది. ఆయా రాష్ట్రాల్లో క‌ఠినంగా ఉన్న కాంగ్రెస్ పెద్ద‌లు.. తెలంగాణ‌లో హైకోర్టు ఆదేశించినా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకుండా ప‌క్క‌దారుల‌ను వెత‌క‌డంపై మిగిలిన పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. జాతీయ‌పార్టీగా ఉన్న కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా వ్య‌వ‌హరిస్తే ప్ర‌జ‌లు కూడా హ‌ర్షిస్తారనే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ప‌ది మంది వ‌ల‌స‌
బీఆర్ ఎస్ బీఫారం ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్‌రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ కాంగ్రెస్‌లోకి చేరారు. కాంగ్రెస్ కండువా క‌ప్పుకుని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి, అప్ప‌టి పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. వారి బాట‌లోనే మ‌రో ఏడుగురు ఎమ్మెల్యేలు ప‌య‌నించారు .
ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, అరికెపూ డి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అ యితే, బీఆర్‌ఎస్‌ను జీరో చేస్తామని, అసలు ఆ పార్టీ అంటూ ఉండదని, ఆ పార్టీలో ఉండి చేసేదేమీ లేదని కాంగ్రెస్‌లో చేరండి అని కాంగ్రెస్‌ పెద్దలు ఇల్లిల్లూ తిరిగి ఆహ్వానాలు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement