Tuesday, November 26, 2024

Exclusive – బిజెపి టార్గెట్ క్లియ‌ర్‌!…ఈసారి గురిత‌ప్పొద్దు

బీజేపీ సెకండ్ లిస్ట్‌పై పెరుగుతున్న‌ ఉత్కంఠ‌
మలివిడత కోసం పార్టీ హైక‌మాండ్‌ స‌న్నాహాలు
మార్చి 11న విడుదలయ్యే అవకాశం
రెండో జాబితాలో తెలంగాణకు ప్ర‌యారిటీ
అయిదు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
మహబూబాబాద్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ సీతారాంనాయక్‌?
ఖమ్మం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు
మహబూబ్‌నగర్‌ నుంచి బరిలో డీకే అరుణ
ఆదిలాబాద్‌ నుంచి ఎంపీ సోయం లేదా మాజీ ఎంపీ నగేష్‌కు చాన్స్‌
మెదక్‌ నుంచి రఘునందన్‌రావు లేదా అంజిరెడ్డికి అవ‌కాశం
ఇద్దరిలో ఎవరికో ఒకరికి ద‌క్క‌నున్న టికెట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు సాధించాల‌ని బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న‌ లక్ష్యంతో ఉంది. ఈ క్ర‌మంలో ఆ దిశగా తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో గెల‌వ‌డ‌మే ప్ర‌ధాన టార్గెట్‌గా దూకుడు పెంచుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కంటే ముందే రాష్ట్రంలోని 9 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి జోరుమీదుంది బీజేపీ. అదే ఊపులో విజయసంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార నగారాను కూడా మోగించింది. ఇక‌.. ప్రధాని మోదీ స్వయంగా రెండు రోజులు రాష్ట్రంలో పర్యటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఇక.. రాష్ట్రంలోని 17 లోక్‌స‌భ స్థానాలకు ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మిగిలిన 8 స్థానాలకూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొలిక్కి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ నెల 10న జరగబోయే బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ భేటీలో రెండో జాబితా అభ్యర్థులపై చర్చించనున్నారు. లోక్‌స‌భ ఎన్నికలకు ఈ నెల 13 కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికంటే ముందే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల‌ని పార్టీ హైక‌మాండ్ స‌న్నాహాలు చేస్తోంది.

తెలంగాణ నుంచి ఐదుగురు..!

రెండో జాబితాలో తెలంగాణ నుంచి ఐదుగురిని బీజేపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా నాలుగు స్థానాలను మార్చి చివరి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. మహబూబాబాద్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, మెదక్ నుంచి రఘునందన్‌ రావు లేదా గోదావరి అంజిరెడ్డి, మహబూబ్‌ నగర్ నుంచి డీకే అరుణ, ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు కానీ, మాజీ ఎంపీ నగేష్‌ను కానీ ప్రకటించే అవకాశం ఉంది. నల్గొండ రేసులో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తప్పుకోవడంతో రామరాజు యాదవ్‌, రంజిత్‌ యాదవ్‌, గొంగిడి మనోహర్‌రెడ్డి, గోలి మధుసూధన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఇక‌.. మెదక్‌ టికెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, గోదావరి అంజిరెడ్డి రేసులో ఉన్నారు.

మ‌రోసారి భేటీ కానున్న లీడ‌ర్లు

రెండు, మూడు రోజుల్లో మరోమారు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత 11వ తేదీన బీజేపీ మలివిడత అభ్యర్థుల జాబితా విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వరంగల్‌, నల్లగొండ, మహబూబాబాద్‌, ఖమ్మం, పెద్దపల్లి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండో విడత అభ్యర్థుల జాబితా ప్రకటనలోపు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లోని బలమైన నేతలను బీజేపీలో చేర్చుకునే ప్రక్రియను కూడా ఆ పార్టీ ముగింపుదశకు తీసుకువచ్చినట్టు చర్చ జరుగుతోంది. లోక్​సభ అభ్యర్థుల ప్రకటనను వీలైనంత త్వరగా ముగించి పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టాలన్నది పార్టీ నాయకత్వం వ్యూహంగా తెలుస్తోంది.

- Advertisement -

సీతారాంనాయక్‌తో కిషన్‌రెడ్డి భేటీకి ప్రాధాన్యం

సార్వత్రిక ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ సీతారాంనాయక్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రె డ్డి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు సాధించి మరోమారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ.. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అసంతృప్త నేతలపై కన్నేసింది. ఈ క్రమంలోనే సీతారాంనాయక్‌ను కిషన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీలో చేరాలని ఆహ్వానించారు. సీతారాంనాయక్‌ బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైపోయిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement