హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో:
పార్టీలో ఎంతటి పెద్దవారైనా, ఉన్నత పదవిలో ఉన్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాల్సిందే! లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. తెలంగాణాలో 75 సీట్లు- సాధించి పాగా వేయాల్సిందేనని భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెగేసి చెప్పారు. సినీనటి జయసుధ బుధవారం ఢిల్లీలో భాజపా తీర్ధం పుచ్చుకున్నారు అంతకుముందు భాజపా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి, ఇతర రాష్ట్ర నేతలు అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై అమిత్ షా కీలక ఆదేశాలు జారీచేసినట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎంపీలుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు, డాక్టర్ కోవ లక్ష్మణ్‌లు అసెంబ్లీ ఎన్నికల్లో తలపడేందుకు సిద్ధంగా ఉండాలని సంకేతాలిచ్చినట్టు- ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఎవరెవరిని పోటీ-కి పెట్టాలన్న అంశంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు ప్రారం భించాలని, తొలుత 30 నుంచి 50 అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్థుల ఎంపికపై ఒక స్పష్టతకు రావాలని సూచించినట్టు- చెబుతున్నారు. ఎలాగైనా సరే తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని అమిత్ షా బల్లగుద్ది చెప్పినట్టు- తెలుస్తోంది.
అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి!, ఎలా ముందుకెళ్లాలి!, ఏం చేస్తే అధికారం బీజేపీ హస్తగతమవుతుంది! ఎన్నికలకు జూలు విదల్చండి. ఇక ఆగకండి.. ముందుకుపోండి.. అంటూ భాజపా అధిష్టానం తెలంగాణ నేతలకు సూచనలు చేసినట్టు- రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండడం.. అంతకన్నా ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అమిత్ షా కోరినట్టు- సమాచారం. తెలంగాణాలో అధికారం దక్కాలంటే ఏం చేయాలో తెలంగాణ నేతలకు అమిత్ షా స్పష్టమైన ఆదేశాలిచ్చారని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలను అనుకూలంగా మలుచుకోవాలని ఈ ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ప్రభావితం చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పినట్టు- సమాచారం.
పెద్ద నేతలూ అసెంబ్లికే..
ఎనీ టాప్ లీడర్, మస్ట్ కం-టె-స్ట్ ఇన్ అసెంబ్లీ పోల్స్ అని బీజేపీ పెద్దలు హుకుం జారీ చేసినట్టు- సమాచారం. హైకమాండ్ నిర్ణయించిన కార్యాచరణ (యాక్షన్ ప్లాన్)ను కేంద్ర మంత్రి అయినా సరే, ఎంపీలు అయినా సరే జాతీయ స్థాయిలో ఏ హోదాలో ఉన్నవారైనా సరే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాల్సిందేనంటూ అమిత్ షా తెగేసి చెప్పినట్టు- ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీ-.బీజేపీకి హైకమాండ్ ఫిక్స్ చేసిన టార్గెట్ 75 సీట్స్. ఈ నెంబర్ సాధించాలంటే, ముఖ్యనేతలంతా అసెంబ్లీ బరిలోకి దిగాలన్నది అమిత్‌షా వ్యూహంగా కనిపిస్తోంది. గెలిచే అవకాశమున్న 75 స్థానాలను గుర్తించడంతోపాటు- కనీసం 35 నుంచి 50 మంది కీలక నేతలను గుర్తించి ఎన్నికలకు సిద్ధమయ్యేలా చూడాలని షా కోరారు. లక్ష్యాన్ని నిర్ణయించడంతో పాటు- ఎన్నికల వ్యూహాలు ఎలా రచించాలన్న అంశంలో అమిత్ షా కీలక ఆదేశాలు ఇచ్చినట్టు- చెబుతున్నారు. భారాస, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కొనేందుకు రాజకీయం ఎలా చేయాలి! ప్రజలకు ఎలా చేరువ కావాలో కూడా ఆయన నేతలకు వివరించి చెప్పినట్టు- సమాచారం. సంప్రదాయ రాజకీయాన్ని పక్కన పెట్టాలని, కొత్త తరహా రాజకీయంతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఆపరేషన్స్.. డైరెక్షన్స్‌తోపాటు-.. అమిత్ షా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు- తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ ఆపరేషన్స్ అన్నీ ఇకపై ఢిల్లీ నుంచే జరిగేలా తెలంగాణ బీజేపీ వార్ రూమ్ ఏర్పాటు- చేశారు. పార్టీ గీత దాటితే ఇకపై ఢిల్లీ నుంచి నేరుగా చర్యలుంటాయని హెచ్చరించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. తక్కువగా మాట్లాడాలని… ఎక్కువగా పని చేయాలని సూచించినట్లు- సమాచారం.
20 నుంచి ఎమ్మెల్యేల పర్యటన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్న భాజపా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని అధ్యయనం చేసేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన 119 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దింపుతోంది. ఈ నెల 20 నుంచి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ఎమ్మెల్యేలు వచ్చి ఆయా నియోజకవర్గాలలో పర్యటించనున్నట్టు సమాచారం. నియోజక వర్గాల్లో వాస్తవ పరిస్థితిని నివేదిక ద్వారా భాజపా జాతీయ నాయకత్వానికి అందజేయనున్నారు.