ట్రైసిటీలో ప్రమాదాకరంగా వాయు కాలుష్యం
ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
300 చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
ముందస్తు చర్యలు లేకపోతే ఢిల్లీ లాంటి పరిస్థితులు
గత ఏడాది కంటే మూడు రెట్లు పెరిగిన వాయు కాలుష్యం
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : హైదరాబాద్ ట్రైసిటీస్లో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది. దీంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆదివారం 300కు చేరింది. దీని ప్రభావం ప్రజల ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటోందని వైద్య నిపుణులు అంటున్నారు. పెరిగిన వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలన్నీ గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నిర్ణీత పరిమాణాన్ని దాటిపోతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నివేదిక ప్రకారం కూకట్పల్లి, మూసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారినట్లు తెలుస్తోంది.
ఢిల్లీకి సమానంగా…
ఆదివారం పలు ప్రాంతాల్లో నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 300 దాటింది. ఢిల్లీకి సమానంగా గాలి కాలుష్యంలో హైదరాబాద్ దూసుకుపోతోందని నగరవాసులు అంటున్నారు. సిటీలో పరిస్థితి చేజారక ముందే నియంత్రణ చర్యలు చేపట్టాలని, కాలుష్య కారకాలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.
కాలుష్య నగరాల జాబితాలో హైదరాబాద్..
పెరుగుతున్న వాహనాల రద్దీ, కాలుష్య కారకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్లో గాలి నాణ్యత పడిపోతోంది. ఏటా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వాహనాలపై నియంత్రణ లేదు. ఏడాది కాలంలోనే కలుషిత నగరాల జాబితాలో హైదరాబాద్ చేరింది. తాజాగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన నివేదిక ప్రకారం దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో ఏడో స్థానంలో హైదరాబాద్ సిటీ ఉందని వెల్లడైంది. మొదటి స్థానంలో ఢిల్లీ ఉంది.. కాగా, నిత్యం ట్రాఫిక్ రద్దీతో ఇబ్బందులు ఎదుర్కొనే బెంగళూరు, చెన్నై నగరాలు హైదరాబాద్ కంటే మెరుగైన ఎయిర్ క్వాలిటీని కలిగి ఉన్నాయి.
గత ఏడాది కంటే…
వాహనాల నుంచి వెలువడే వ్యర్థాలు, కాలుష్య కారకాల పరిమాణం ఒక్క ఏడాదిలో భారీగా పెరిగింది. గతంలో సాధారణ రోజుల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 150 మేర ఉండేది. ప్రస్తుతం 300 చేరుకుంది. అయితే.. గతేడాదిలో గాలిలో పీఎం2.5 స్థాయితో పోల్చితే ఈసారి నగరంలోని పలు ప్రాంతాల్లో మూడింతలు పెరిగినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నగరంలో కాలుష్య నియంత్రణకు దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.
వాహన కాలుష్యంపై ప్రభుత్వం దృష్టి..
ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదంగా మారడంతో హైదరాబాద్లో ఎయిర్ పొల్యూషన్ పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధానంగా వాహన కాలుష్య నివారణపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. వంద శాతం ట్యాక్స్ రాయితీ ఇచ్చింది. పొగవచ్చే వాహనాలను తగ్గిస్తూ పొగరహిత వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
కాలం చెల్లిన వాహనాలపై కొరడా..
హైదరాబాద్ సిటీలో కాలం చెల్లిన వాహనాలపై ప్రభుత్వం కొరడా ఝాళిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో దాదాపు 40 లక్షల వాహనాలు ఉన్నట్టు తెలుస్తోంది. సుమారు పదిహేను సంవత్సరాలు దాటిని వాహనాలను నివారించాలి. లేకుంటే వాయు కాలుష్యానికి ప్రదాన కారణం అవే అవుతున్నాయి. తొలుత ప్రభుత్వ అధికారుల సేవల్లో ఉన్న కాలం చెల్లి వాహనాలకు చెక్ పెట్టి, వాహనదారులపై చర్యలు తీసుకుంటే వాయు కాలుష్యం తగ్గుతుందనే భావన సామాన్య ప్రజల నుంచి వినిపిస్తోంది.
పరిశ్రమల వ్యర్థాలపై దృష్టి సారించాలి..
కాలుష్య నివారణను పరిశ్రమలు పట్టించుకోవడం లేదు. పొల్యూషన్ బోర్డు ఇచ్చే సూచనలు ప్రతి పరిశ్రమ పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పొలుష్యన్ బోర్డు ఇచ్చే సూచనలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని సిటీ ప్రజలు కోరుతున్నారు.