Tuesday, November 26, 2024

అదరగొట్టిన అమ్మాయిలు.. లంకపై తొలి టీ-20లో భారత్‌ మహిళల గెలుపు..

శ్రీలంకతో జరుగుతున్న టీ-20 సిరీస్‌లో భారత మహిళా క్రికెట్‌ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసి 1-0 ఆధిక్యాన్ని సాధించింది. తొలిమ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. డంబుల్లా స్టేడియంలో గురువారం జరిగిన తొలిటీ-20 మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన భారత జట్టు కెప్టెన్‌ హర్మ్‌న్‌ప్రీత్‌ కౌర్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్‌ను శ్రీలంక బౌలర్లు దెబ్బతీశారు. మూడో ఓవర్‌లో ఓపెనర్‌ స్మృతి మంధానా ఒక పరుగుకే వెనుదిరిగింది. శ్రీలంక జట్టులోని స్పిన్నర్‌ ఒషాడి రణసింఘే బౌలింగ్‌లో మంధానా షాట్‌ కొట్టగా చామరి ఆటపట్టు అందుకోవడంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయినట్టయింది. ఆ తరువాత రణసింఘే బౌలింగ్‌లో సభ్బినేని మేఘన ఔట్‌ ఔటవడంతో భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత బరిలోకి దిగిన కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, షఫాయ్‌ వేమ ధాటీగా ఆడుతూ పరిస్థితిని చక్కదిద్దారు. 31 పరుగుల చేసిన వేమ జట్టు స్కోరును పెంచేందుకు ప్రయత్నించగా ఆటపట్టు బౌలింగ్‌లో ఔటయ్యారు. ఆ తరువాత కొద్ది సేపటికే 11 ఓవర్‌లో కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (22)ను స్పిన్నర్‌ రణవీర ఎల్‌బీడబ్ల్యూ చేశారు. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌ విమెన్‌ రిచాఘోష్‌ (11), పూజా వస్త్రాకర్‌ (14)లను కూడా రణవీర ఔట్‌ చేయడంతో భారత్‌ స్కోరు 17 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 106 పరుగులకు చేరింది. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్‌ చేయడంతో భారత్‌ పరుగులు సాధించేందుకు కష్టపడాల్సి వచ్చింది.

ఐదోస్థానంలో వచ్చిన రోడ్రిగ్స్‌, వరుసగా మూడు ఫోర్లు, సిక్స్‌ కొట్టి భారత్‌ స్కోరును వేగంగా పెచింది. దీప్తి శర్మతో కలసి ఆమె స్కోరును పరుగెత్తించే ప్రయత్నం చేశారు. కేవలం 8 బంతుల్లో దీప్తి శర్మ 17 పరుగులు చేయడం విశేషం. మొత్తంమీద భారత్‌ స్కోరు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ ప్రారంభించిన శ్రీలంక పేలవ ప్రదర్శన చేసింది. 139 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన శ్రీలంక చమరి ఆటపట్టు ఓపెనర్‌గా ఆచితూచి ఆడారు. వయోభారంతో ఆమె ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. అదీగాక కవిష దిల్హరి క్యాచ్‌ విడిచిపెట్టడం, చివరి ఓవర్‌లో 20 పరుగులు ఇవ్వడం వంటి పరిణామాలు శ్రీలంకను దెబ్బతీశాయి. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవల 104 పరుగులే చేయడంతో భారత మహిళల జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ-20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. భారత జట్టులో రాధాయాదవ్‌ రెండు, దీప్తిశర్మ, పూజా వస్త్రాకర్‌, షఫాలి వర్మ తలో వికెట్‌ సాధించారు. శ్రీలంక బౌలర్లలో రణవీర 3, రణసింగే రెండు వికెట్లు, ఆటపట్టు ఒక వికెట్‌ పడగొట్టారు. భారత ఆటగాళ్లలో రోడ్రిగ్స్‌ అత్యధికంగా 36, షఫాలి వర్మ 31 పరుగులుచేశారు. కాగా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా జెమిమా రోడ్రిగ్స్‌ ఎంపికైంది. ఇరుజట్ల రెండో టీ-20 మ్యాచ్‌ శనివారం జరగనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement