ప్రభన్యూస్, హైదరాబాద్ ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వచ్చే విభాగాల్లో ఎక్సైజ్ శాఖ ప్రథమ స్థానంలో ఉంది. సర్కార్‌కు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చుతున్న తమశాఖ విధుల్లో పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని అబ్కారి శాఖ అధికారులు అంతర్గతంగా అసహనం వెల్లగక్కుతున్నారు. వైన్స్‌లు, పబ్‌లు, బార్లపై పూర్తిస్థాయి అధికారం తమదేనని, అయితే నగరంలోని కొంతమంది పోలీసు అధికారుల వల్లే ఈ ఘర్షణ వాతావరణం తలెత్తుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పబ్‌లు, బార్లు, ఫైవ్ స్టార్ హోటళ్లు ప్రభుత్వం ఇచ్చిన సడలింపును సైతం దాటి విచ్చలవిడిగా తెల్లవార్లూ మద్యం అమ్మకాలు సాగిస్తున్నాయి. లేట్ నైట్ పార్టీలు, డీజే సౌండ్లు, అశ్లిల నృత్యాలతో నగర వాతావరణాన్ని చెడగొడుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటిన తర్వాత అమ్మకాలు సాగించడంతో పాటు మైనర్లకు పబ్‌ల్లో అనుమతినివ్వడం, గంజాయి తదితర మత్తు పదార్థాలను సరఫరా చేయడంలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో నగరంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యతలో భాగంగానే వైన్స్‌లు, పబ్‌లు, బార్లపై నిఘా పెడుతున్నామని పోలీసులు అంటున్నారు. వారు సక్రమంగా విధులు నిర్వహిస్తే తామెందుకు అతిగా జోక్యం చేసుకుంటామని మరికొంతమంది పోలీసు ఉన్నతాధికారులు అంటున్నట్టు సమాచారం. ఇంత రాద్దాంతం జరుగుతున్నా ఇప్పటి వరకు అమ్నేషియా పబ్ విషయంలో ఆబ్కారి శాఖకు చెందిన ఏ ఉన్నతాధికారి స్పందించక పోవడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.