న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పరస్పరం సీట్లను మార్చుకున్నారు. ఢిల్లీలోని అధిష్టానం పెద్దల సాక్షిగా ఈ పరిణామం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ చొరవతో ఈ సీట్ల మార్పునకు ఇద్దరు నేతలు అంగీకారం తెలిపినట్టు తెలిసింది.
పాలేరు నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్‌లో చేరిన తర్వాత అక్కడి నుంచే పోటీ చేయాలని అనుకున్నారు. పొంగులేటి కూడా పాలేరు లేదా కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఒక చోట నుంచి పోటీ చేయాలని భావించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు కాగా మిగిలిన 3 సీట్లపై ఈ తరహా పోటీ నెలకొనడంతో అధిష్టానం లోతుగా అధ్యయనం చేసింది.
ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లలో ఏ సామాజికవర్గం ప్రజలు ఎంత మంది ఉన్నారన్న లెక్కలు తీసింది. ప్రత్యర్థి బీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థుల సామాజికవర్గాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు తెలిసింది. గెలుపే పరమావధిగా ముందుకెళ్లాలంటే పొంగులేటి పాలేరు నుంచి, తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేయడమే ఉత్తమం అన్న అభిప్రాయానికి వచ్చింది. తద్వారా ఖమ్మం పట్టణంలో సుమారు 50 వేల మంది జనాభా ఉన్న ‘కమ్మ’ సామాజికవర్గం ఓటర్లను పొంగులేటి కంటే తుమ్మల ఎక్కువగా ఆకట్టుకోగలరని అధిష్టానం భావించింది. ఇదే విషయాన్ని తుమ్మలకు అధిష్టానం పెద్దలు చెప్పినట్టు తెలిసింది.
పార్టీ ఎక్కడంటే అక్కడే
శనివారం ఉదయం రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన తుమ్మల నాగేశ్వర రావు, సాయంత్రం పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కూడా కలిశారు. నిన్నటి నుంచి ఢిల్లీలోనే ఉన్న ఆయన అధిష్టానం పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసినట్టు వెల్లడించారు.
కేసీ వేణుగోపాల్ నివాసం వద్ద పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు మీడియాతో మాట్లాడిన తుమ్మల.. పార్టీ ఎక్కణ్ణుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కణ్ణుంచి పోటీ చేస్తానని చెప్పారు. తాను గతంలో పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహించినందున తొలుత అక్కణ్ణుంచి పోటీ చేయాలని భావించినట్టు తెలిపారు. అయితే అంతిమ నిర్ణయం పార్టీదేనని, పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిందిగా రాహుల్ గాంధీ సూచించారని తెలిపారు.
కాంగ్రెస్ గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రేవంత్ రెడ్డికి చేదోడువాదోడుగా తన వంతుగా శాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపారు. రేవంత్ సహా కాంగ్రెస్‌లో మరికొందరు పెద్దల ఆహ్వానం మేరకే తాను కాంగ్రెస్‌లో చేరానని, సీడబ్ల్యూసీ సమావేశంతో పాటు ఆరోజు జరిగిన బహిరంగ సభలో పార్టీలో చేరినప్పటికీ అధిష్టానం పెద్దలతో అప్పుడు చర్చించడానికి వీలుపడలేదని తెలిపారు. ఇప్పుడు అధిష్టానం ఆదేశం మేరకే ఢిల్లీకి వచ్చి పెద్దలను కలిసినట్టు తుమ్మల వెల్లడించారు.