Tuesday, November 19, 2024

ఇబ్బడిముబ్బడిగా పురుగుల మందు వాడకం.. తెలంగాణలో మరీ ఎక్కువ అంటున్న శాస్త్రవేత్తలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో రైతులు ఇబ్బడిముబ్బడిగా క్రిమిసంహారకాలు.. (పురుగు మందు) వాడేస్తున్నారని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంతో పోల్చు కుంటే భారతదేశంలోనే సాగులో ఎక్కువగా క్రిమి సంహారకాలను వినియోగిస్తుండగా… అందులో తెలంగాణలో మరీ విపరీతంగా వినియోగమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లా తర్వాత తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాలో విస్తారంగా పురుగు మందులను రైతులు వినియోగిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి వసతి పెరగడంతో పంటల సాగు పెరిగింది. గత ఖరీఫ్‌లో దాదాపు అన్ని పంటలు కలిపి కోటి ఎకరాల దాకా సాగయ్యాయి.

ఇందులో 50లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు కాగా, 40 లక్షల ఎకరాల వరకు పత్తి సాగ యింది. ప్రస్తుతం పత్తి, మక్క, వరి, మామిడి, పసుపు, మిరప, సోయాబిన్‌ పంటలు పెద్ద ఎత్తున సాగవుతుండగా పెసలు, కందులు, మినుములు తదితర పంటలు కూడా రికార్డుస్థాయి విస్తీర్ణంలో సాగువుతున్నాయి. ఈ నేపథ్యంలో పత్తిలో ప్రతి హెక్టారుకు 3-6 లీటర్ల వరకు, వరిలో 3 లీటర్ల దాకా క్రిమిసంహార కాలు, 10 కిలోల గుళికలను వినియోగిస్తున్నారు. ఇక మొక్కజొన్నలో హెక్టారుకు 7.5కిలోల గుళికలు, మామిడిలో హెక్టారుకు 12 లీటర్ల పురుగు మందులు, మిగిలిన పంటల్లో 1.5-3 లీటర్ల వరకు ప్రతి హెక్టారుకు వినియోగిస్తున్నారు.

తక్కువ ప్రభావమున్న మందుల స్థానంలో సింథటిక్‌ ఫైరిత్రాయిడ్స్‌ ను కూడా వినియోగిస్తున్నారు. కూరగాయల సాగులోనూ విస్తారంగా క్రిమిసంహారకాల వినియోగం పెరిగిపోయింది. అత్యంత శక్తివంతమైన క్రిమి సంహారకలను కూర గాయల పంటలపై పిచికారి చేస్తున్న రైతులు… తగినంత కాల వ్యవథి ఇవ్వకుండానే కూరగాయలను కోసి మార్కెట్‌కు తరలిస్తున్నారన్న ఆందోళనను శాస్త్ర వేత్తలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

పురుగుమందులు అధిక మోతాదులో వినియోగిం చిన ధాన్యం, కూరగాయలు, పండ్ల ఉత్పత్తులను తిన్న ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. పురుగుల మందుల అవశేషాలు (అఫ్లోటాక్సిన్స్‌ ) పలు వ్యవసాయ ఉత్పత్తుల్లో అధిక మోతాదులో ఉంటున్నట్లు తేలింది. వరిలో గుళికలను పొడి ఇసుకతో కలిపి చల్లాల్సి ఉండగా.. చాలా మంది రైతులు యూరియాలో కలిపి చల్లుతున్నారు. యూరియాలో కరిగిన గుళికలు రైతుల చేతులు, వారి చర్మంపై ఉన్న స్వేదరంద్రాల ద్వారా రక్తంలో కలిసి తీవ్ర అస్వస్థతకు గురవడంతో పాటు కొన్నిసార్లు రైతులు ప్రాణాలు కూడా విడుస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చాలాచోట్ల రైతులు పురుగు మందుల్లోనే తెగుళ్ల నివారణా మం దులు, పోషకాలను కలిపి పంటలపై చల్లుతున్నారు.

రెండు మూడురకాల అడుగు మందలును కలపాల్సి వచ్చిన పుడు కర్రతో కాకుండా నేరుగా చేతితోనే కలుపుతుండ డంతో వాటి విష ప్రభావానికి రైతులు సులువుగా లోనవుతున్నారు. మహిళా రైతులు సులు వుగా అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. వ్యవసాయంలో ఆధునిక సదుపాయాలు అందు బాటులోకి వచ్చిన నేపథ్యంలో రైతులు ఉద్యానవన శాఖ, వ్యవసాయాధికారులను సంప్రదించాకే పం టకు వినియోగించాల్సిన క్రిమిసంహారకాలు, అడుగు మందులను మోతాదు మేరకే వినియోగించాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది. క్రిమిసంహారకాలు పిచి కారి చేసే సమయంలో ముఖానికి మాస్కు, చేతులకు తొడుగులు తదితర రక్షణ ఏర్పాట్లు తప్ప నిసరి గుర్తు చేస్తోంది. వ్యవసాయాధికారులను సంప్ర దించకుండా ఇష్టానుసారం ఫెస్టిసైడ్స్‌ను వినియోగించి అటు ఆర్థి కంగా, ఇటు ఆరోగ్యపరంగా తీవ్ర నష్టాలను కొనితెచ్చు కోవద్దని రైతులకు వ్యవసాయశాఖ సూచిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement