అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన 6,511 ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌కు లక్షల్లో ఉద్యోగార్ధుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చాయి. ఈక్రమంలో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదివారం విడుదల చేసింది. ఈమేరకు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎస్‌ఎల్‌పీఆర్‌బి తెలియచేసింది. ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేష్రన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు కానిస్టేబుల్ పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీని కూడా విడుదల చేసిన పోలీసు నియామక మండలి వె బ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కాగా 6100 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు 5,09,579 లక్షల ఆన్‌లైన్ దరఖాస్తులు రాగా జనవరి 22వ తేదీన నిర్వహించిన రాతపరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
20.73 శాతం అర్హత..
ఆదివారం విడుదలైన రాత పరీక్ష ఫలితాల ప్రకారం వీరిలో 95,208 మంది అభ్యర్థులు (20.73 శాతం) ఫిజికల్ ఈవెంట్ టెస్ట్‌కు అర్హత సాధించారు. ఫలితాలకు సంబంధించి పూర్తి వివరాలతో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఓఎంఆర్ షీట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని బోర్డు వెల్లడించింది. రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 997 పరీక్షా కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 200 మార్కులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ఓసీలకు 40 శాతం (80 మార్కులు), బీసీలకు 35 శాతం (70 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు 30 శాతం (60 మార్కులు) కటాఫ్‌గా నిర్ణయించారు. పరీక్షకు హాజరైన మొత్తం 45,9182 మంది అభ్యర్ధుల్లో 36,3432 మంది పురుషులు 77876 మంది మాత్రమే అర్హత సాధించారు. అదేవిధంగా 95750 మంది మహిళల్లో 17332 మంది అభ్యర్ధులు రాత పరీక్షల్లో అర్హత సాధించారు.
రాతపరీక్షకు 91 శాతం హాజరు..
కానిస్టేబుల్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5,03,487 మంది అభ్యర్థులు హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 4,58,219 మంది మాత్రమే అంటే 91 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 45,268 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 6100 పోస్టుల్లో సివిల్ కానిస్టేబుల్ పోస్టులు జిల్లాల వారీగా శ్రీకాకుళం- 100, విజయనగరం- 134, విశాఖపట్నం సిటీ-187, విశాఖ రూరల్- 159, తూర్పు గోదావరి- 298, రాజమహేంద్రవరం అర్బన్ – 83, పశ్చిమ గోదావరి- 204, కృష్ణా- 150, విజయవాడ సిటీ – 250, గుంటూరు రూరల్ – 300, గుంటూరు అర్బన్ – 80, ప్రకాశం- 205, నెల్లూరు- 160, కర్నూలు- 285, కడప- 325, అనంతపురం- 310, చిత్తూరు- 240, తిరుపతి అర్బన్- 110 కలిపి మొత్తం 3580 పోస్టుల కేటాయింపు జరిగింది. అదేవిధంగా ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా ఎచ్చెర్ల- శ్రీకాకుళం 630, రాజమహేంద్రవరం 630, మద్దిపాడు – ప్రకాశం 630, చిత్తూరు- 630 చొప్పున మొత్తం 2520 పోస్టులు కేటాయింపు జరిగింది.
13 నుంచి స్టేజ్-2 దరఖాస్తులు..
గత నెల 22న పరీక్ష ముగిసిన వెంటనే ప్రిలిమినరీ కీని రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. దీంతో 2261 అభ్యంతరాలు వచ్చాయని వాటిని నిపుణులతో మీదట నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని బోర్డు పేర్కొంది. ఇదిలావుండగా రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులు రెండో దశకు దరఖాస్తు చేసకోవాల్సి ఉంటుందని, ఇందుకోసం ఈనెల 13వ తేదీ సాయంత్రం మూడు గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. రెండో దరఖాస్తు చేసుకున్న వారికి ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ నిర్వహిస్తారు.