కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు పేట్రేగి పోయారు. తీవ్రవాదుల కాల్పుల్లో ఒక కశ్మీరీ పండిట్ మృతి చెందగా, అతని సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదఘటన మంగళవారం కశ్మీర్‌లోయలోని షోపియాన్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆపిల్ పండ్లతోటలో పని చేస్తున్న సాధారణ ప్రజలపై తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో ఒక కశ్మీర్ పండిట్ అక్కడికక్కడే మృతి చెందగా, అతని సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.మరణించిన వ్యక్తిని సునీల్‌కుమార్, క్షతగాత్రుడిని పింటుకుమార్‌గా పోలీసులు గుర్తించారు. సుమారు మూడు నెలల తర్వాత తీవ్రవాదులు కశ్మీర్ పండిట్లపై కాల్పులకు తెగబడ్డారు.
మూడు నెలల క్రితం బుద్గామ్‌లో కశ్మీరీ పండిట్‌ను తీవ్రవాదులు కాల్చి చంపడంతో, అందుకు నిరసనగా పండిట్లు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఉగ్రవాదుల దాడుల భయంతో ఐదు వేల మంది కశ్మీరీ పండిట్లు విధులకు హాజరు కావడం లేదు. కశ్మీర్ వ్యాలీలో పరిస్థితులు చక్కబడే వరకు తమను జమ్మూలో ఉద్యోగాలు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.