Friday, November 22, 2024

భారత విదేశాంగ విధానం భేష్‌.. పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రశంసలు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మరోసారి ఇండియాపై పొగడ్తల వర్షం కురిపించారు. లాహోర్‌లో ఈ రోజు (ఆదివారం) నిర్వహించిన సభలో ఇమ్రాన్‌ఖాన్‌ భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ స్లొవాకియాలో బ్రటిస్లావాలో చేసిన ప్రసంగం వీడియో క్లిప్పింగ్‌ను ప్రదర్శించారు. అమెరికా ఒత్తిళ్లను లెక్క చేయకుండా, భారత్‌ తక్కువ ధరకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఇమ్రాన్‌ఖాన్‌ సమర్థించారు. ఇండియా, పాకిస్థాన్‌లకు ఒకేరోజు స్వాతంత్య్రం లభించినా, న్యూఢిల్లి మాత్రం దేశ ప్రజల అవసరాలకు తగినట్లు విదేశాంగ విధానానికి కట్టుబడి ఉందని, కానీ, పాకిస్థాన్‌లోని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఇమ్రాన్‌ఖాన్‌ విమర్శించారు.

అమెరికాకు ఇండియా వ్యూహాత్మక భాగస్వామి. కానీ, పాకిస్థాన్‌ కాదు. కానీ, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దన్న అమెరికా ఆంక్షలను భారత్‌ ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. పైగా చమురు కొనవద్దనేందుకు మీరెవరని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ అమెరికాను ప్రశ్నించారు. రష్యా నుంచి యూరప్‌ గ్యాస్‌ కొనుగోలు చేస్తోంది. మా దేశ అవసరాలకు అవసరమైన చమురు కొంటున్నామని అంతర్జాతీయ వేదికపై అగ్రరాజ్యం అమెరికాకు స్పష్టం చేశారని, ఒక స్వతంత్య్ర దేశ విదేశాంగ విధానమంటే ఆవిధంగా ఉండాలని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రశంసించారు. అమెరికా ఆగ్రహానికి భయపడి రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించిన పాక్‌ ప్రధానిపై ఇమ్రాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కవ రేటుకు రష్యా ఆయిల్ దిగుమతి చేసినా, అమెరికాకు భయపడి పాక్‌ కొనలేదని ఇమ్రాన్‌ ఎద్దేవా చేశారు. పాకిస్థాన్‌లో ఫ్యూయల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజలు దారిద్య్రపు రేఖకు దిగువన ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బానిసత్వానికి వ్యతిరేకినని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement