Tuesday, November 26, 2024

మాజీ మంత్రి నారాయణకు సుప్రీంలో ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అమరావతి మాస్టర్ ప్లాన్ మార్చిన కేసులో మాజీ మంత్రి పి. నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ నాగరత్నతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. మాజీ మంత్రి దర్యాప్తునకు సహకరించడం లేదని, ఈ పరిస్థితుల్లో ఆయనకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. సీఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మౌఖిక ఆదేశాలతో మార్చారని, నారాయణ తన మంత్రి పదవిని దుర్వినియోగం చేశారని చెప్పారు.

తీవ్రమైన ఆర్థిక నేరాల కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ధర్మాసనం రాజకీయ వివాదాల్లోకి న్యాయస్థానాలను లాగుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. మాజీ మంత్రి నారాయణ విచారణకు సహకరించనిపక్షంలో ఆయనకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ రద్దు చేయాలని కోరవచ్చని సూచించింది. ముందస్తు బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం దర్యాప్తుపై పడకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది.

అమరావతి రింగ్‌రోడ్డు, అలైన్‌మెంట్‌, భూసేకరణ సమయంలో నాడు మంత్రిగా నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టులు లేకుండా నిరోధించాలని ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం బెయిల్ రద్దుపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అక్కడ కుదరనిపక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement