బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఇంజినీర్ నిషాంత్ అగర్వాల్‌కు నాగ్‌పూర్ కోర్టు జీవితఖైదు విధించింది. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేసినట్లు, కీలకమైన సాంకేతిక సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును విచారించిన నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు 14 ఏళ్ల కఠిన కారాగారశిక్షతో పాటు రూ.3000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
నాగ్‌పూర్‌లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్‌లో నాలుగేళ్ల పాటు విధులు నిర్వర్తించిన నిషాంత్ అగర్వాల్.. పాకిస్తాన్‌కు ఓ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనను మిలిటరీ ఇంటెలిజెన్స్, మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 2018 లో అరెస్ట్ చేశాయి. ఆయనపై ఐపీసీ సెక్షన్లతో పాటు అఫీషియల్ సీక్రేట్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపర్చారు.
కేసును విచారించిన నాగ్‌పూర్ సెషన్స్ న్యాయమూర్తి దేశ్‌పాండే.. నిషాంత్ అగర్వాల్‌పై వచ్చిన ఆరోపణలను నిర్ధారించారు. ఆయనకు 14 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. 2018 నుంచి జైలులో ఉన్న నిషాంత్‌కు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నాగ్‌పూర్ హైకోర్టు బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్‌ను డీఆర్డీఓ, మిలిటరీ పారిశ్రామిక కన్సార్టియం సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.