Tuesday, November 26, 2024

అధికారంలోకొస్తే ఈవీఎంలకు స్వస్తి.. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌లో కాంగ్రెస్‌ వెల్లడి

ఉదయ్‌పూర్‌(రాజస్థాన్‌): మూడు రోజులపాటు ”నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌- 2022” పేరిట రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా మేధోమథన సదస్సు ఆదివారం ముగిసింది. వరుస సంక్షోభాలను ఎదుర్కొంటున్న పార్టీ సమూల ప్రక్షాళనే లక్ష్యంగా చింతన్‌ శిబిర్‌లో కాంగ్రెస్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌కు ఆమోదం తెలిపింది. ఈవీఎంలపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో అధికారంలోకి వస్తే ఈవీఎంలకు స్వస్తి పలకాలని ప్రాథమికంగా నిర్ణయించింది. పేపర్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ పద్ధతిని ప్రవేశపెట్టాలని తీర్మానించింది. మొత్తం 20 ప్రతిపాదనలకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ఇక పార్టీ బలోపేతం దిశగా కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ”ఒక కుటుంబానికి ఒకే టికెట్‌” విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆమోదించింది. ఒక నాయకుడు ఐదు సంవత్సరాలపాటు మాత్రమే ఒక పదవిలో ఉండాలని తీర్మానించింది. మరొకరు అదే కుటుంబం నుంచి వచ్చేట్లు అయితే… కనీసం మూడేళ్లపాటు పార్టీలో పనిచేయాలని నిబంధన విధించింది. 70ఏళ్లు నిండిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న సూచనపై ఏకాభిప్రాయం కుదరలేదు.

రాబోయే కాలంలో యువనాయకత్వాన్ని ముందుపెట్టాలని కాంగ్రెస్‌ అధిష్టానం దాదాపుగా నిర్ణయించింది. పార్టీలో యువతకు 50శాతం భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. బ్లాక్‌ స్థాయి నుంచి సీడబ్ల్యూసీ స్థాయి వరకు 50శాతం యువత ఉండేలా చర్యలు తీసుకోవాలని సంకల్పించకుంది. 50శాతం యువత కోటాలో ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, మైనారిటీలకు కూడా చోటు ఉంటుందని స్పష్టం చేసింది. దీంతోపాటు కేరళ తరహాలో పార్టీకి జాతీయ శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడికి సహాయపడేందుకు పబ్లిక్‌ ఇన్‌సైట్‌, ఎన్నికల నిర్వహణ, జాతీయ స్థాయిలో శిక్షణ అనే విభాగాల ఏర్పాటు, వివిధ కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. పార్టీలో ప్రియాంకగాంధీ పాత్రను పెంచడంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement