ఎన్నికల్లో కీలకమైన ఈవీఎంను తీసుకుని ఓ పోలింగ్ బూత్ ఆఫీసర్ తన చుట్టాలింటికి వెళ్లారు. పశ్చిమబెంగాల్ హౌరా జిల్లాలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ ఇల్లు టీఎంసీ నేతకు సంబంధించినది కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈవీఎంలు, వీవీప్యాట్లు తృణమూల్ కాంగ్రెస్ లీడర్ గౌతమ్ ఘోష్ నివాసంలో లభించడంతో బాధ్యులైన సెక్టార్ అధికారిని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఘోష్ నివాసంలో లభించిన ఈవీఎంలు రిజర్వ్‌డ్ ఈవీఎంలని, వాటిని పోలింగ్‌లో వినియోగించడం లేదని స్పష్టం చేసింది. హౌరా జిల్లాలోని 17 సెక్టార్ ఆఫీసర్ తపన్ సర్కార్ రాత్రి తనతోపాటు ఈవీఎంలను తీసుకుని ఉలుబేరియాలోని బంధువుల ఇంటికి వెళ్లారని ఈసీ తెలిపింది. ఇది నిబంధనల ఉల్లంఘనేనని పేర్కొంది. తపన్ సర్కార్ బంధువు టీఎంసీ నేత గౌతమ్ ఘోష్ అని తేలింది.
ఈ సెక్టార్ ఆఫీసర్‌తో అటాచ్ చేసిన సెక్టార్ పోలీసునూ సస్పెండ్ చేయాలని ఆదేశించినట్టు ఈసీ వెల్లడించింది. ఆ ఈవీఎంలు, వీవీప్యాట్‌లను స్టాక్ నుంచి తొలగించామని, వాటిని ప్రస్తుత పోలింగ్‌లో వినియోగించడం లేదని వివరించింది. వాటి సీల్స్‌ను జనరల్ అబ్జర్వర్ నీరజ్ పవన్ పరిశీలించారని, వీటిని ఒక పర్యవేక్షకుడి పరిధిలో ప్రత్యేక గదిలో భద్రపరచనున్నట్టు తెలిపింది. అసోంలో ఈవీఎంలు ఓ బీజేపీ ఎమ్మెల్యే కారులో లభించిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. చివరికి రాతాబరిలోని సంబంధిత ఏరియాలో మళ్లీ పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించాల్సి వచ్చింది.