హైదరాబాద్, ప్రభన్యూస్ : గ్రూప్-1 నోటిఫికేషన్‌కు సర్వం సిద్ధమైంది. నోటిఫికేషన్‌కు ముందు పూర్తి చేయాల్సిన అన్ని పనులను టీఎస్‌పీఎస్సీ చక్కదిద్దుకుంటోంది. ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా అన్ని అంశాలను పరిశీలిస్తూ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈక్రమంలోనే సోమవారం టీఎస్‌పీఎస్సీ ప్రత్యేక సమావేశమై ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన అంశాలు, ప్రకటన తేదీ, మార్కుల అంశాలను చర్చించినట్లు సమాచారం. నోటిఫికేషన్ విడుదలకు ముందు మరోసారి సమావేశమై గ్రూప్-1 నోటిఫికేషన్‌ను జారీ చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 22న చివరి సమావేశాన్ని నిర్వహించి ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో లేదా అదే రోజు నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
గ్రూప్-1, 2 పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ ప్రభుతం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇంటర్యూకు కేటాయించిన మార్కులను తొలగించి మిగిలిన మార్కులకే రాత పరీక్షను నిర్వహించే వీలుంది. ఇంటర్వ్యూలకు సంబంధించిన మార్కులను తీసేయగా గ్రూప్-1కు 900 మార్కులు, గ్రూప్-2కు 600 మార్కులే ఉండనున్నాయి. ప్రస్తుతం 503 ఉద్యోగాల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత గ్రూప్-2కు కొంత సమయం తీసుకొని నోటిఫికేషన్ వేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే 503 గ్రూప్-1 పోస్టులకు సంబంధించిన ఇండెంట్లు, అభ్యర్థుల అర్హత వివరాలు టీఎస్‌పీఎస్సీకి చేరాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..