Wednesday, November 20, 2024

Delhi: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు అంతా రెడీ.. 36 ప్రాంతాల్లో 67 పోలింగ్ బూత్‌లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దాదాపు 19వ శతాబ్దంలోనే ఆవిర్భవించి, సుదీర్ఘ రాజకీయ చరిత్రను సొంతం చేసుకున్న కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవి కోసం దాదాపు రెండున్నర దశాబ్దాల అనంతరం ఎన్నికలు జరుగుతున్నాయి. ఎనిమిది పదుల వయస్సు కల్గిన మల్లికార్జున ఖర్గే, మాజీ బ్యూరోక్రాట్ శశిథరూర్ ముఖాముఖి ఈ పోటీలో తలపడుతున్నారు. సోమవారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక్కో బూత్‌లో గరిష్టంగా 200 మందికి మించకుండా మొత్తం 36 ప్రాంతాల్లో 67 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది.

9 వేల మందికి పైగా ప్రతినిథులు ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆయన వెంట ఉన్నందున, ప్రత్యేకంగా ఒక బూత్‌ను జోడో యాత్ర క్యాంపులో ఏర్పాటు చేశారు. మిగతా బూత్‌లను ఆయా రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నెలకొల్పారు. ప్రతి రాష్ట్రానికి ఒక రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని పార్టీ నియమించింది. తెలంగాణ రాష్ట్రానికి రిటర్నింగ్ అధికారిగా కేరళకు చెందిన రాజమోహన్ ఉన్నితన్‌ను నియమించగా, ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి రిటర్నింగ్ అధికారిగా తెలంగాణకు చెందిన పొన్నం ప్రభాకర్‌ను పార్టీ నియమించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇదేమాదిరిగా ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను రిటర్నింగ్ అధికారులుగా నియమించింది.

- Advertisement -

ఉదయం గం. 10.00 నుంచి పోలింగ్ మొదలై, సాయంత్రం గం. 4.00 వరకు జరగనుంది. పోలింగ్ ఏజెంట్లు, రిటర్నింగ్ అధికారి ఉదయం గం. 8.30కే పోలింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని ఏఐసీసీ తెలిపింది. పార్టీ జారీ చేసిన క్యూఆర్ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులను ప్రతినిధులు తీసుకురావాలని సూచించింది. అలాగే తమకు నచ్చిన అభ్యర్థికి 1 అంకెను రాసి ఓటు వేయాలని పేర్కొంది. అయితే 1 అంకెకు బదులుగా టిక్ మార్క్‌ను అనుమతించాలని బరిలో ఉన్న శశిథరూర్ వర్గం డిమాండ్ చేసింది.

బీజేపీ నేతలే ఆత్మవిమర్శ చేసుకోవాలి
వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలన వంటి విమర్శల నుంచి తప్పించుకోవడం కోసం తూతూ మంత్రంగా ఈ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తిప్పికొట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నది తాము మాత్రమేనని, తమను విమర్శిస్తున్న బీజేపీలో అధ్యక్షుణ్ణి ఎంపిక (నామినేట్) చేయడమే తప్ప ఎన్నికల ప్రక్రియ ద్వారా జరగడం లేదని విమర్శించారు. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా, అంతకు ముందు అమిత్ షా, అంతకు ముందు రాజ్‌నాథ్ సింగ్.. ఇలా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఎన్నికల ప్రక్రియ ద్వారా అధ్యక్షులను ఎన్నుకోలేని ఉదహరించారు.

కానీ తాము ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఎవరైనా పోటీ చేసే అవకాశాన్ని కూడా కల్పించామని పొన్నం ప్రభాకర్ అన్నారు. తాను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న ఢిల్లీ పీసీసీలో మొత్తం 280 మంది ఓటర్లున్నారని, ఈ క్రమంలో 140 మందికి ఒక బూత్ చొప్పున రెండు బూత్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశవ్యాప్తంగా అసెంబ్లీ యూనిట్‌ను ప్రాతిపదికగా తీసుకుని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ప్రతినిధులు ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారని, ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో మున్సిపల్ సీటును ప్రాతిపదికగా తీసుకుని ప్రతినిధులను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, అధిష్టానం ఎంపిక అంటూ ఎవరూ లేరని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement