వైమానిక దళానికి చెందిన విమానంలో భారత్ కు వచ్చిన ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఎంపీ నరేందర్ సింగ్ ఖాస్లా భావోద్వేగానికి గురైయ్యారు. కాబూల్ నుంచి ఘజియాబాద్ హిండన్ వైమానిక స్థావరానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని పరిస్థితులను తలుచుకుంటేనే కన్నీరు వస్తోందని చెప్పారు. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పాలన అనంతరం గత 20 ఏళ్లుగా నిర్మించింది మొత్తం ఇప్పుడు నాశనమైపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, చాలా రోజుల నుంచి కాబూల్‌లోని గురుద్వారాలో కొందరు తాలిబన్లకు చిక్కకుండా దాక్కున్నారు. భారత్ చేరుకున్న సిక్కులను ఢిల్లీలోని బంగ్లా సాహిబ్ గురుద్వారాకు తరలిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ లోని కాబూల్ విమానాశ్రయం నుంచి భారత వైమానిక దళానికి చెందిన ఓ విమానంలో 107 మంది భారతీయులు సహా మొత్తం 168 మంది భారత్‌లోని ఘజియాబాద్ హిండన్ వైమానిక స్థావరానికి చేరుకున్న విషయం తెలిసిందే.