Wednesday, November 20, 2024

మాస్క్ లేకుండా బయటకు వస్తే… ఇక మీ పని అంతే !!

కరోన కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ ప్రజలు విచ్చల విడిగా ఎటువంటి సామాజిక బాధ్యతను పాటించకుండా నియమాలను విస్మరించి ఎటువంటి మాస్క్ లు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతున్నారు. అయితే ఈ క్రమంలోనే కరోన కేసులు కట్టడి దృష్ట్యా విజయవాడ నగర పోలీస్ కమీషనర్ బి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్,లా అండ్ ఆర్డర్ పోలీస్ వారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ లను నిర్వహించారు. రోడ్ల మీద మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని గుర్తించి వారికి జరిమానాలను విధించారు.

ఈ సందర్భంగా విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాలలో మాస్క్ లు లేకుండా తిరుగుతున్న వారిని గుర్తించి 134 కేసులు నమోదు చేశారు. మొత్తం రూ.12,500/-లు జరిమానాలు విధించారు. విజయవాడ నగర ప్రజలు బయటకు వచ్చే టప్పుడు విధిగా మాస్క్ లను ధరించి కరోన బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మాస్క్ ధరించాలని కోరారు. భిన్నంగా వ్యవహరించిన వారికి జరిమానా విధించడం జరుగుతుందని పోలీసులు తెలియపరిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement