Friday, November 22, 2024

‘హరితహారం’లో అందరూ భాగస్వాములు కావాలి : మంత్రి హ‌రీష్ రావు

చనిపోయిన వారికి గుర్తుగా ఒక మొక్కను నాటి.. వారిని స్మరించుకోవాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్‌లో 12వ గ్రాండ్‌ నర్సరీ మేళాను గురువారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి ప్రారంభించారు. ఈ నెల 22 వరకు నర్సరీ మేళా కొనసాగనుండగా.. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 140 పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేళాను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నగర వాసులకు ఇదో మంచి అవకాశమని, హోం గార్డెన్‌, టెర్రస్‌ గార్డెన్‌, వర్టికల్‌ గార్డెన్‌, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇదో మంచి వేదిక అన్నారు. నర్సరీలతో మేలు జాతి మొక్కలు, అంటుకట్టిన మొక్కలు అందుబాటులోకి వచ్చాయన్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి వచ్చే మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచనతో తెలంగాణకు హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల పేరిట నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అడవులను పునరుజ్జీవం చేశారని, ఈ నెల 21న భారత వజ్రోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారని, అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement