సిద్ధిపేట, ఆంధ్రప్రభ: భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేయనుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. పోటీ పరీక్షల ఉద్యోగార్థులకు ఉచిత భోజనం సదుపాయం కల్పించటంతోపాటు స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రూప్1,2 పరీక్షలకు ఇంటర్వ్యూలను రద్దు చేయడంతో రాత పరీక్షతో పారదర్శకతతో ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చెప్పారు. త్వరలోనే 500 పైగా గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని ప్రకటించారు.
గ్రూప్ 1 సర్వీసుల్లోనూ 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే చెందుతుందని స్పష్టం చేశారు. 317జీఓతో అన్నీ జిల్లాల ఉద్యోగులకు సమ న్యాయం చేస్తున్నామన్నారు. ఈ అంశంపై కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు మాట్లాడటం ప్రతిపక్షాలకు తగదన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాల తీరు చూస్తుంటే… దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
317జీవో సారాంశం తెలియకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు దీక్ష చేపట్టారో, ఏమిటో ఆయనకే తెలియాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న 15 లక్షల 65 వేల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తుందో చెప్పాలని బండి సంజయ్‌ను డిమాండ్ చేశారు. కేంద్ర పరిధిలోని ఒక్క రైల్వేశాఖలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈ విషయమై బీజేపి నాయకులను ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఇస్తామంటే బీజేపీ నేతలకు పాలాభిషేకం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అన్నీ రంగాల్లో అగ్రగామిగా ఉందని, బీజేపి నాయకులు నోరు పారేసుకోవడం తప్ప అసలు విషయం మాట్లాడరని విమర్శించారు. బీజేపి డబుల్ ఇంజన్ గ్రోత్ ఎక్కడకి పోయిందని ప్రశ్నించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి లేదని స్పష్టం చేశారు. బీజేపీ నేతల మాయ మాటలపై ఆలోచించాలని తెలంగాణ యువతను కోరారు. దమ్ముంటే తెలంగాణలోని 23 జిల్లాలకు రావాల్సిన నవోదయ పాఠశాలలను మంజూరు చేయించుకరావాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. జాబ్ స్పేస్ యాప్ ద్వారా ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న మెసేజ్ సందేశం ద్వారా సిద్ధిపేట గ్రంథాలయంలో చదువుకుంటున్న విద్యార్థులకు తెలియనుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..