కాలిఫోర్నియా – రికార్డు స్థాయిలో ఏకంగా 44 బిలియన్ డాలర్లు వెచ్చించి ఏడాది క్రితం కొనుగోలు చేసిన ట్విట్టర్ (ప్రస్తుతం ‘ఎక్స్’) ద్వారా అదనపు ఆదాయాన్ని పొందాలని అధినేత ఎలాన్ మస్క్ భావిస్తున్నారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఎక్స్ యాప్‌పై ప్రత్యేకంగా డేటింగ్ ఫీచర్ జోడించాలని ఆయన భావిస్తున్నట్టు కంపెనీ అంతర్గతవర్గాలు పేర్కొన్నాయి. అయితే ఒకే సైట్‌పై డేటింగ్ ఫీచర్‌ను ఎలా అందుబాటులోకి తీసుకొస్తారనే వివరాలు తెలియరాలేదు.
ట్విట్టర్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వీడియో కాల్లో ఎలాన్ మస్క్ తన ప్రణాళికలను వెల్లడించినట్టు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. 2024 నాటికల్లా ఈ డేటింగ్ ఫీచర్‌ని తీసుకురావొచ్చని తెలుస్తోంది. డేటింగ్ ఫీచర్‌తోపాటు ‘ఎక్స్’పై డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్ తీసుకురావాలని మస్క్ భావిస్తున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ‘ఎక్స్’ను ‘ఎవ్రీథింగ్ యాప్’గా మార్చాలని భావిస్తున్నట్లు గతంలో ఓ సందర్భంలో పేర్కొన్న విషయం తెలిసిందే. మరిన్ని కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడమే ఆయన లక్ష్యంగా ఉంది.