ఎర్రగడ్డ సండే మార్కెట్.. గుండు పిన్ను నుంచి మొదలుకుని అన్ని రకాల గృహోపకరణాలు అతి తక్కువ ధరకు దొరికే అరుదైన మార్కెట్. దాదాపు వంద సంవత్సరాల క్రితం ఎర్రగడ్డ మెట్రో వద్ద చిన్నగా ప్రారంభమైన ఈ మార్కెట్ నేడు నగరంలోనే అతి పెద్ద అంగడిగా అవతరించింది. ఎర్రగడ్డ మెట్రో నుంచి సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ,బస్టాండ్ ఫ్లైఓవర్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా వెలిసిన ఈ మార్కెట్ సామాన్యుడి సంతగా మన్ననలు అందుకుంటోంది.
ప్రభ న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి: ఎర్రగడ్డ మెట్రో నుంచి సనత్ నగర్ పోలీస్ స్టేషన్ మీదుగా బస్టాండ్ ఫ్లై ఓవర్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా వెలిసిందే ఎర్రగడ్డ సండే బజార్. ప్రతి ఆదివారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నడిచే ఈ మార్కెట్లో 500 వరకు షాపులు వెలుస్తాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ మార్కెట్ జనాలతో కిక్కిరిసి పోతుంది. గుండు పిన్ను నుంచి గృహోపకరణాల వరకు దాదాపు అన్ని రకాల వస్తువులు ఈ మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. బట్టలు, బూట్లు, పాత సైకిళ్లు, వాహనాల విడిబాగాలు, వంట సామగ్రి, ఫోన్లు, చార్జర్లు, టీవీలు, ఫ్రీజ్‌లు, రీట్రేడిం గ్ చేసిన టైర్లు, పాత, కొత్త ఫర్నిచర్, పురాత నాణాలు తదితర అన్ని రకాల వస్తువులు చవకగా దొరుకుతాయి. నాటు కోళ్లకు ఈ మార్కెట్ ప్రత్యేకం. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్రల నుంచి ఇక్కడికి నాటు కోళ్లను తీసుకు వస్తారు. కేజీకి రూ.400 నుంచి 500 వరకు ధర పలికే ఈ కోళ్ల కోసం జనం ఎగబడుతారు.
అరుదైన నాణేలు అరుదైన నాణేలు
ఈ మార్కెట్లో అతి పురాతమైన నాణేలను అమ్మకానికి ఉంచుతారు. 16వ శతాబ్దం నుంచి నేటి వరకు వివిధ రకాల నాణేలు దొరుకుతాయి. ఒక్క పైసా, రెండు పైసలు, 10, 20 పైసలు, చారానా, ఆఠానా మొదలుకుని పాత 10, 20, 50, 10 రూపాయల నోట్లు అందుబాటులో ఉంటాయి. మొఘలులు, బ్రిటీషర్లు, అరబ్, కాకతీయ తదితర రాజుల కాలం నాటి ఈ అరుదైన నాణేలతో పాటు నేపాల్, సౌదీఅరేబియా కరెన్సీ దొరుకుతుంది. డిమాండ్‌ను బట్టి నాణేలను రూ.100 నుంచి రూ.5 వేల వరకు అమ్ముడవుతాయి.
ప్రతి రోజు 2 కోట్ల వ్యాపారం
సండే మార్కెట్ ఎర్రగడ్డ మెట్రో నుంచి సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ,బస్టాండ్ ఫ్లైఓవర్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా దాదాపు 500 షాపులు వెలుస్తాయి. ప్రతి ఆదివారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాగే బజార్‌లో 2 కోట్లకు పైగా వ్యాపారం జరగుతుందని అంచనా. ఒకప్పుడు నగరంలో అతి పెద్ద వార సంతగా పేరొందిన జుమ్మేరాత్ బజార్‌ను తల దన్నేలా ఇక్కడ అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండటంతో కొనుగోళ్లు భారీ ఎత్తున జరుగుతాయి. సనత్ నగర్, ఎర్రగడ్డ, అమీర్ పేట, పంజాగుట్టతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు కొనుగోలు చేసేందుకు వస్తారు.