సింగరేణిలో పని చేస్తున్న ప్రతీ ఒక్క ఉద్యోగికి సమాజంలో మంచి గౌరవం, గుర్తింపు లభిస్తున్నాయని.. మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతున్న సంస్థ భవిష్యతే ప్రతీ ఒక్కరికీ ప్రథమ ప్రాధాన్యం కావాలని సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. సింగరేణి ఉజ్వల భవిష్యత్ కోసం ప్రతీ ఒక్కరూ తమకు కేటాయించిన 8 గంటల పాటు అంకితభావంతో పనిచేయాలన్నారు.
నూతన సంవత్సరం నేపథ్యంలో గురువారం సింగరేణి భవన్ లో ఉద్యోగులందరినీ ఉద్దేశించి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ప్రతీ ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు.
ఉద్యోగుల పనితీరుపై పూర్తిస్థాయిలో మదింపు ఉంటుందని, పనిచేసే వారికి తగిన గుర్తింపు, నిర్లక్ష్యంగా ఉండే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయన్నారు. రక్షణ, నాణ్యతతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదక సాధించాలని, ప్రతీ ఒక్కరూ వారికి కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వర్తించాలని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ జనక్ ప్రసాద్, జీఎం కో ఆర్డినేషన్ ఎస్డి.ఎం.సుభానీ, జీఎం మార్కెటింగ్ రవి ప్రసాద్, జీఎ సోలార్ సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.