Wednesday, November 20, 2024

విద్యుత్‌ వ్యవస్థలో ప్రతి చర్య ప్రజలకోసమే.. బీఈఈ సహకారంతో ఏపీ ఇంధన శాఖ ప్రణాళిక

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో 2030 నాటికల్లా 6.68 మిలియన్‌ టన్‌ ఆఫ్‌ ఆయిల్‌ ఈక్వలెంట్‌ (ఎంటీ-వోఈ) ఇంధనాన్ని పొదుపు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర ఇంధన సామర్ధ్య కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఇందుకు సహకరిస్తుందన్నారు. కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సహకారం తీసుకుంటు న్నట్లు తెలిపారు. ఈసందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో పెరగనున్న ఇంధన డిమాండ్‌ అందుకోవడానికి ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలే తక్షణ పరిష్కారమని చెప్పారు. ఇందుకోసమే ఇంధన రంగంలో ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఇంధన సామర్ధ్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలకు ఇది దోహదపడుతుందని, ప్రతి కుటు-ంబం దీని వల్ల ప్రయోజనం పొందుతుందని తెలిపారు. విద్యుత్‌ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న అది ప్రజా ప్రయోజనాలు పరిరక్షించడం కోసమేనని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్‌ రంగం బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎన్నడూ రాజీ పడదని స్పష్టం చేశారు.

నిరంతర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం..

24/7 నాణ్యమైన చౌక విద్యుత్‌ సరఫరాకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈలక్ష్య సాధనకు ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. చౌకలో నాణ్యమైన , తగినంత విద్యుత్‌ లభ్యత రాష్ట్రంలో ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందన్నారు. దీనివల్ల 24/7 విద్యుత్‌ సరఫరా మరింత పటిష్టమవుతుందని, ఇది అంతిమంగా పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి ఉపకసరిస్తుందని పేర్కొన్నారు. గతంలో కోవిడ్‌ సమయంలో వినియోగదారులకు, ఆస్పత్రులకు తదితర కేటగిరీలకు, ఇటీవల దేశ వ్యాప్తంగా ఎంతటి బొగ్గు కొరత సంక్షోభం ఉత్పన్నమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు నాణ్యమైన నమ్మకమైన కరెంటును అందచేయటంలో రాజీ పడలేదని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలు, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, రాష్ట్రంలో ప్రతి కుటుంబ సంక్షేమానికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, విద్యుత్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కట్టు బడి ఉన్నారు. ఇంధన పొదుపు, సామర్ధ్య పెంపు, ట్రాన్స్‌మిషన్‌ లాస్‌ తగ్గించుకోవడంలో, పునరుత్పాదక ఇంధన వనరులను పెంపొందించడం, వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడంలో రాష్ట్ర విద్యుత్‌ రంగం దేశంలోనే ప్రతిష్టాత్మకమైన విద్యుత్‌ రంగంగా పేరు తెచ్చుకుందని మంత్రి గుర్తుచేశారు. మున్ముందు కూడా వినియోగదారుల అవసరాలు ఆకాంక్షలు అనుగుణంగా విద్యుత్‌ వ్యవస్థ పనిచేస్తుందని హామీ ఇచ్చారు.

2070 నాటికి కాలుష్య రహిత రాష్ట్రంగా :

దేశాన్ని 2070 నాటికి కాలుష్య రహితంగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇంధన సామర్ధ్య కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని బీఈఈ కోరింది. దీనిలో భాగంగా బీఈఈ సెక్రటరీ ఆర్‌కే రాయ్‌ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసిఎం) అధికారులతో ఆన్‌లైన్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలు ద్వారా 2030 నాటికీ దేశంలో 45 శాతం ఇంధన వినియోగ అవసరం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు-కుందన్నారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు ఇంధన పొదుపు కార్యాచరణను తయారు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రోడ్‌మ్యాప్‌ను రూపొందించడం జరుగుతుందన్నారు.

- Advertisement -

ఏపీలో అనేక కార్యక్రమాలు :

ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య పెంపు లక్ష్యాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలించిందన్నారు. అలాగే రాష్ట్ర ఇంధన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సత్వరమే చర్యలు తీసుకుందని ప్రశంసించారు. ఏపీని ఇంధన సామర్ధ్య రాష్ట్రంగా మార్చడం పట్ల ప్రభుత్వానికున్న నిబధ్దతకు ఇది నిదర్శనమన్నారు. దీని వల్ల రాష్ట్రం అనేక విధాలుగా ప్రయోజనం పొందుతుందన్నారు. ఇందుకోసం ఇంధన సామర్ధ్య రంగంలో పెట్టు-బడులకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంధన సామర్ధ్య రంగంలో జాతీయ స్థాయిలో రూ.10.02 లక్షల కోట్ల పెట్టు బడులకు అవకాశం ఉందన్నారు. దీనివల్ల రాష్ట్ర ఆర్థికాభివృధితో పాటు ఉపాధి కల్పన, పర్యావరణం మెరుగవుతుందని పేర్కొన్నారు.

కీలక రంగాలను భాగస్వాములను చేయాలి..

ఆంధ్ర ప్రదేశ్‌ లక్ష్యమైన 6.68 ఎంటీ-ఓఈ ఇంధన పొదుపు సాధనకు అన్ని కీలక పరమైన రంగాలను భాగస్వాములుగా చేయవల్సిందింగా బీఈఈ కార్యదర్శి కోరారు. జాతీయ స్థాయి లక్ష్యమైన 150 ఎంటీ-ఓఈ ఇంధనం పొదుపునకు ఇది దోహద పడుతుందని 887 మిలియన్‌ టన్నుల కార్బన్‌ ఉద్గారాలను 2030 నాటికీ తగ్గించడంలో కూడా దోహదకారి అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో వార్షిక విద్యుత్‌ డిమాండ్‌ దాదాపు 66000 మిల్లియను యూనిట్లు ఉండగా అందులో దాదాపు 15000 మిలియన్‌ యూనిట్లు- పొదుపుచేసే అవకాశం ఉందని ఏపీఎస్‌ఈసిఎం అధికారులు వివరించారు. ప్రధానంగా పారిశ్రామిక, మునిసిపల్‌, వ్యవసాయ, గృహ వినియోగ రంగాలలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతం రూపొందిస్తున్న రాష్ట్ర ఇంధన కార్యాచరణ ప్రణాళిక దోహదపడుతుందన్నారు. ఇందుకు సహకారం అందిస్తున్న బీఈఈ కు ఏపీఎస్‌ఈసిఎం అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement