చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మంగళవారం ఆ కంపెనీ మార్కెట్‌లోకి విడుదల చేసింది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ 2021లోనే ఆవిష్కరించింది. మార్కెట్లోకి విడుదల చేసే విషయంలో చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. మొదట ఆవిష్కరించిన స్కూటర్‌లో కంపెనీ సాంకేతికంగా, భద్రత పరంగా, మైలేజీ పరంగా అనేక పరీక్షలు చేయడంతో పాటు, టెక్నికల్‌గా అప్‌డేట్ చేస్తూ వచ్చింది. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని ఇవ్వడం కోసం, సురక్షితమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వడం కోసం సుదీర్ఘంగా టెస్ట్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది.
సింపుల్ వన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పై చాలా సమయం, నిధులు ఖర్చు చేసినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ తెలిపారు. ఎక్కువ దూరం, అత్యంత స్మార్ట్, ఫాస్ట్ టెక్నాలజీ, డ్యుయల్ బ్యాటరీ ఈ స్కూటర్ ప్రత్యేకతలని ఆయన తెలిపారు. ఐపీ67 రేటింగ్‌తో కూడిన 5కిలోవాట్ లిథియం ఐయాన్ డ్యుయల్ బ్యాటరీ ప్యాక్‌తో సింపుల్ వన్ స్కూటర్‌ను ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ స్కూటర్ తయారీలో 95 శాతం పరికరాలను దేశీయంగానే సమకూర్చుకున్నట్లు చెప్పారు. సింపుల్‌వన్‌లో అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో 7 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేను ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. నావిగేషన్, డాక్యుమెంట్ స్టోరేజ్, బ్లూటూత్ కనెక్టివిటీ, బ్యాటరీ రేంజ్ వివరాలు, కాల్ ఆలర్ట్ వంటి వివరాలు తెరపై కనిపిస్తాయని వివరించారు. సింపుల్ వన్ స్కూటర్‌ను ఇంట్లో 5 గంటల 54 నిముషాల్లో ఛార్జింగ్ పూర్తవుతుంది. మొత్తం 6 రంగుల్లో లభిస్తోంది.
ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ స్కూటర్ ధర 1.45 లక్షలు (ఎక్స్‌షోరూమ్ బెంగళూర్) నుంచి ప్రారంభమవుతుంది. 750 వాట్ పోర్టబుల్ ఛార్జర్‌కు అదనంగా 13వేలు చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా జూన్6 నుంచి బెంగళూర్‌లో సింపుల్ వన్ డెలివరీలు ప్రారంభమవుతాయని, తరువాత దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది.