Friday, November 22, 2024

ఏపీ సాగుకు యూరప్‌ సాంకేతికత.. ఈబీటీ సీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

అమరావతి, ఆంధ్రప్రభ: వ్యవసాయరంగంలోని ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకునేలా ఏపీలోని రైతాంగానికి సహకారం అందించేందుకు యూరోపియన్‌ బిజినెస్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఈబీటీసీ) ముందుకొచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికీ, ఈబీటీసీకి మధ్య పరస్పర అవగాహనా ఒప్పందం (ఎంవోయు) కుదరనుంది. మార్చి 3,4 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న జీ 20 గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌ – 2023లో అధికారికంగా ఎంఓయు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఈబీటీసి అధికారుల బృందం విశాఖకు రానుంది. వివిధ పంటల సాగుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక అంశాలపై ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నట్టు ఈబీటీసీ సీఈవో ఆదా డైండో వెల్లడించారు. నాణ్యత, దిగుబడితో పాటు ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేలా రసాయన రహిత సేంద్రీయ వ్యవసాయంలో యూరప్‌ లో అనుసరిస్తున్న సాగు విధానాలపై ఇక్కడి రైతులకు అవగాహన కలిగించనున్నారు. ఈ మేరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో రైతులకు శిక్షణ అందించనున్నారు.

- Advertisement -

ఆధునిక సాంకేతికను విస్తృతంగా వినియోగించటం ద్వారా సుస్ధిర వ్యవసాయ విధానాలను యూరప్‌ అవలంబిస్తోంది. సంప్రదాయ పంటలకు తోడు బహుళ పంటల విధానాన్ని సమాంతరంగా అమలు చేయటం, ఎగుమతి ఆధారిత పంటలపై దృష్టి సారించటం ద్వారా మార్కెటింగ్‌ డిమాండ్‌ పెరిగి రైతులకు వ్యవసాయం లాభదాయకంగా మారుతుంది..దీని కోసం యూరప్‌ లో అనుసరిస్తున్న పద్ధతులను ఏపీలో స్థానిక వాతావరణ, అవసరాల దృష్ట్యా మార్పు చేసుకుని అమలు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీపీఎస్‌, ఫీల్డ్‌ మ్యాపింగ్‌, రిమోట్‌ సెన్సింగ్‌, డ్రోన్ల వినియోగం, సాంకేతిక బదిలీ తదితర అంశాలపై ఈబీటీసీ ఏపీలో పనిచేయనుంది. దీని కోసం విశాఖపట్నంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌ లెన్స్‌ ను ఏర్పాటు చేసేలా ఈబీటీసీ, ఏపీ ప్రభుత్వం మధ్య ఎంవోయు కుదరనున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement