న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పూటకొక పార్టీ, సంవత్సరానికొక జెండా పట్టుకునే రకం తాను కాదని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీలో ఈటల రాజేందర్ అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని వచ్చిన ఊహాగానాలపై ఆయన ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తన 20 ఏళ్ల రాజకీయ చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని, టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వెళ్లగొట్టిన తర్వాత తనను బీజేపీ అక్కున చేర్చుకుందని చెప్పారు. అంతే తప్ప తానేమీ రాజీనామా చేసి పోలేదని, పార్టీలు మారేవాణ్ణి కాదని వెల్లడించారు. కేసీఆర్ మంచిపనులు చేసి జనం మెప్పు పొందాలని చూడరని, ఇతర పార్టీలను బలహీనపర్చడం, వాటిలో గందరగోళం సృష్టించడం ద్వారా మాత్రమే ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తారని సూత్రీకరించారు. అన్ని పార్టీల్లో కోవర్టులను పెట్టుకుని, వారిచ్చే సమాచారంతో ఎదుటి పార్టీలను దెబ్బకొట్టాలని చూస్తుంటారని తెలిపారు.
ఇదే రీతిలో బీఎస్పీ, సీపీఐ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను మింగేశారని ఉదహరించారు. కేసీఆర్ నమ్ముకున్న ప్రజాబలాన్ని కాదని, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, కుట్రలు – కుతంత్రాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తారని ఆరోపించారు. డబ్బు సంచులను, ప్రలోభాలను నమ్ముకుని నాయకులను కొనుక్కనే కల్చర్ ఆయనదని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ పరిస్థితుల్లో తనపై కాంగ్రెస్ నేతలు సానుభూతి చూపాల్సిన అవసరం లేదని, ప్రజల సానుభూతి ఉందని వ్యాఖ్యానించారు. తాను బీజేపీలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ రూ. 800 కోట్లు ఖర్చు చేసి, ఎన్నో కుట్రలు చేసినప్పటికీ హుజూరాబాద్ ప్రజలు తనను కడుపులో పెట్టుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలకు కూడా తన చరిత్ర తెలుసు కాబట్టే వారి ఆశీర్వాదం తనపై ఉంటుందని అన్నారు.
నీ పదవి రాజ్యాంగం ప్రసాదించిందే..
మరోవైపు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై, గణతంత్ర దినోత్సవాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు వ్యవహరించిన తీరును ఈటల తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజైన జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాజ్యాంగం పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్చాకరంగా ఉందని మండిపడ్డారు. కొంతమంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు గవర్నర్ పట్ల ఉపయోగించిన భాష, మాట్లాడిన తీరు చూసి యావత్ మహిళా లోకం సిగ్గుతో తలదించుకుందని అన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, గవర్నర్, ముఖ్యమంత్రి వంటి పదవులు రాజ్యాంగబద్ధంగా సంక్రమించినవేనని, వాటికి వచ్చే గౌరవం వ్యక్తిగతమైనదేమీ కాదని చెప్పారు. గవర్నర్‌ను అవమానపరచడం అంటే రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని చెప్పారు.
కేసీఆర్ గవర్నర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదని, తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో హోదా మరిచి మరీ నాటి గవర్నర్‌కు సాష్టాంగ నమస్కారం చేసిన వ్యక్తేనని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. కానీ మహిళా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వచ్చిన తర్వాత ఆమె పట్ల వ్యవహరించిన తీరు సభ్యసమాజం గమనిస్తోందని అన్నారు. గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు మధ్య ఏవైనా ఇబ్బందులుంటే ముఖ్యమంత్రులే కూర్చుని పరిష్కరించుకుంటారు తప్ప గణతంత్ర దినోత్సవాలను బహిష్కరించలేదని చెప్పారు. తమిళనాడులో, ఢిల్లీలో ప్రతిపక్ష ప్రభుత్వాలున్నా సరే గవర్నర్లను కించపరిచే విధంగా మాట్లాడలేదని, ఉత్సవాలను నిషేధించలేదని ఉదహరించారు. గణతంత్ర ఉత్సవాలను నిషేధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా తాను ఈ అంశంపై కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేస్తానని అన్నారు.
మహిళలంటే చులకన
తను ఫ్యూడల్ వ్యవస్థలో పుట్టానని కేసీఆర్ స్వయంగా చెప్పుకున్నారని, దొరల వ్యవస్థలో పురుషాధిక్యత ఉంటుందని, స్త్రీల పట్ల చులకన భావన ఉంటుందని చెప్పారు. అందుకే ఐదేళ్ల పాటు రాష్ట్ర మంత్రివర్గంలో మహిళ లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఘనుత కేసీఆర్ దక్కించుకున్నారని తెలిపారు. చివరకు ఎమ్మెల్యే పదవుల్లోనూ దళిత, బీసీ మహిళలకు చోటు లేకుండా చేశారని విమర్శించారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని తీర్మానాలు చేస్తారు తప్ప ఆచరణ మాత్రం లేదని అన్నారు. “బొడిగశోభ ఉద్యమకారిణి, ఒకే ఒక్క మహిళ ఎమ్మెల్యే ఉంటే ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఈ మహిళ నా చెప్పుచేతుల్లో ఉండదు, బానిసత్వంలో ఉండదు. ప్రశ్నించేతత్వం ఉంటుంది.. ప్రశ్నించే వారు ఉండవద్దు అని ఉన్నొక్క గొంతును నొక్కి మహిళా జాతిని అవమానపరిచిన వ్యక్తి కెసిఆర్” అన్నారు. మహిళలపట్ల కేసీఆర్ చులకన భావనను తెలిపే కొన్ని ఘటనలను ఉదహరించారు.
సరూర్ నగర్‌లోని ఓ అనాధ పాఠశాలలో ఒకటే టాయిలెట్ ఉందని, 400 మంది బాలికలు చెంబు పట్టుకుని బయటికి పోవాల్సి వస్తుందని వార్తలు రాసినా పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలో ఆడపిల్లలు టాయిలెట్లు లేకపోవడం వల్ల, మంచినీళ్లు తాగడం లేదని, యూరిన్ రాకుండా టాబ్లెట్లు వేసుకుంటున్నారన్న వార్త సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భమని అన్నారు. జగిత్యాలలో మున్సిపల్ చైర్మన్ శ్రావణి ఏడుస్తూ రాజీనామా చేసిందని, ఒక మహిళా చైర్‌పర్సన్ అన్న ఉద్దేశంతో అక్కడున్న ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నారని, దీన్నిబట్టే మహిళల పట్ల ఎంత చులకన భావన ఉందో అర్థమవుతోందని చెప్పారు.
ఆత్మహత్యలు కనిపించండ లేదా?
ఉద్యోగాలు రావడం లేదని ఖమ్మంలో ఒక వ్యక్తి, అసైన్మెంట్ భూమిని గుంజుకున్నందుకు 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యలు చేసుకున్నారని, కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలో ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించిన రమేష్ డబుల్ బెడ్ రూమ్ రావటం లేదని స్వయంగా వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని గుర్తుచేశారు. ధరణి పోర్టల్ వల్ల ఉత్పన్నమైన సమస్యలు ఆర్డిఓ, కలెక్టర్ల కాళ్లు పట్టుకున్నా పరిష్కారం కాక.. కోర్టుకు ఫీజులు కట్టలేక.. కన్నీళ్ల పర్యవంతమై ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలియడం లేదా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తామని ప్రచారం చేసుకుంటున్నారని, తెలంగాణలో ఏ గ్రామంలోనైనా రైతులు తమకు 24 గంటల కరెంటు వస్తుందని చెబితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. గిరిజనకాలనీల్లో, హరిజనవాడలలో మీటర్లు లేవని.. దళితబస్తీలకు కరెంటు కట్ చేసి దళితులను అంధకారంలో ముంచుతున్న దుర్మార్గులని మండిపడ్డారు.
ఢిల్లీలో జాడ లేని తెలంగాణ
దేశ రాజధాని ఢిల్లీలో అన్ని రాష్ట్రాలు తమ సంస్కృతిని ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాల్లో, ప్రదర్శనల్లో పాల్గొంటుంటే, తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రదర్శించే ఏ వేదికనూ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదని అన్నారు. ట్రేడ్ ఫెయిర్, రిపబ్లిక్ డే పరేడ్ సహా అనేక వేదికలపై తెలంగాణ జాడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో తెలంగాణ భాగం కాదు అన్నట్టు, తెలంగాణనే ఒక దేశం అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదని ఈటల మండిపడ్డారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలు భారత రాజ్యాంగానికిలోబడే కొనసాగాలి తప్ప భిన్నంగా కొనసాగడానికి అవకాశం లేదని కేసిఆర్ గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు.
దెయ్యాలు వేదాలు వల్లించినట్టు…
ప్రధానమంత్రి ఒక ఆదివాసి బిడ్డను రాష్ట్రపతిని చేశారని, ఆమెకు విదేశీ వ్యవహారాల గురించి, అంతర్గత భద్రత, సాయుధ బలగాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారని, కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి సంస్కారం సభ్యత లేదని అన్నారు. చివరికి ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యులను అవసరం లేకున్నా యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని చట్టబండలు చేస్తూ బీఎస్పీని, సీపీఐ, తెలుగుదేశం చివరికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా మింగేశారని వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులుగా తాము లొంగకుండా, ఆయన అడుగులకు మడుగులు ఒత్తకుండా నిలదీసిన పాపానికి గెలిచి 13 నెలలవుతున్నా ఒక్కనాడు కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా దయ్యాలు వేదాలు వల్లించినట్టు కేంద్రం మీద ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతూ రాచరికపు, కుటుంబ పాలనను రాష్ట్రం మీద రుద్దుతున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ అని ఈటల రాజేందర్ విమర్శించారు.
కేసీఆర్ బానిసలు, కేసీఆర్ సంధించిన సైకో శాడిస్టులు తమ మీద మాట్లాడినంత మాత్రాన తమ స్థైర్యం దెబ్బతినదని అన్నారు. ఆ మాటలు మరింత స్ఫూర్తిగా తీసుకొని పోరాడతామని చెప్పారు. కేసీఆర్, ఆయన మంత్రులు మాట్లాడుతున్న భాష, తిట్ల పురాణాలు తమకు ఆశీర్వాదాలని స్వయంగా ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చినప్పుడే చెప్పారని గుర్తుచేశారు. ఈ ముఖ్యమంత్రినా తాము ఎన్నుకుంది అని ప్రజలందరూ ముక్కున వేలేసుకుంటున్నారని, 2023 డిసెంబర్ తర్వాత కొనసాగే కేసీఆర్ ఆస్కారమే లేదని చెప్పారు. తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో నిరంకుశత్వాన్ని, కేసీఆర్ అహంకారాన్ని, మహిళా వ్యతిరేకతను బొందపెట్టి తీరతారని వ్యాఖ్యానించారు.