Tuesday, November 26, 2024

అమిత్ షా తో ఈటల భేటీ.. పలువురు బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులను కలిసిన ఈటల


న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గత మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన బీజేపీ ఎమ్మెల్యే, పార్టీలో చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇవ్వాల (గురువారం) రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. అర గంటకు పైగా ఆయన కేంద్ర మంత్రితో అనేకాంశాలపై ముఖాముఖి చర్చించారు. నిజానికి మంగళవారం ఉదయం కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డితో పాటు ఢిల్లీ చేరుకున్న ఈటల బీజేపీ పెద్దలతో వరుసగా సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, రాష్ట్ర సంఘటన్ కార్యదర్శి సునీల్ బన్సల్‌, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన ఈటల పార్టీకి సంబంధించిన అనేకాంశాల గురించి చర్చించినట్టు తెలిసింది. అలాగే కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌తోనూ ఆయన భేటీ అయ్యారు. అయితే తొలి రెండ్రోజులు పార్టీకి సంబంధించి అగ్రనేతలైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో లేకపోవడంతో వారిని కలవలేదు. గురువారం సాయంత్రం అమిత్ షా ఢిల్లీ చేరుకోగా, ఆ కాసేపటికే ఈటల రాజేందర్‌కు అపాయింట్మెంట్ దొరికింది. మునుగోడు ఉప-ఎన్నికల ఫలితాలు సహా తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీలో అంతర్గత వ్యవహారాల గురించి చర్చించినట్టు సమాచారం.

ముఖ్యంగా పార్టీలో కొత్తగా చేరినవారిని పార్టీలో ముందు నుంచీ ఉన్న నేతలు చులకనగా చూస్తున్నారని, పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానాలకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. నిజానికి పార్టీలో చేరుతున్న నేతల కారణంగా బీజేపీ బలోపేతమై విజయాలను అందిస్తోందని, రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి అసలైన ప్రత్యర్థిగా ప్రజలు బీజేపీని చూసేలా చేయడంలో పార్టీలో కొత్తగా చేరుతున్న నేతలే కారణమనే విశ్లేషణ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈటల ఏకాంతంగా నెంబర్-2 పవర్ సెంటర్‌గా చెప్పుకునే అమిత్ షాతో చర్చలు జరపడం తెలంగాణ బీజేపీ వర్గాల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది.

సరిగ్గా ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో జరిగే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరవుతారని తెలిసింది. పనిలో పనిగా పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. మునుగోడు ఉపఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ, అక్కడ కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి ద్వితీయస్థానంలో నిలబడడం, గెలుపొందిన టీఆర్ఎస్‌తో పోల్చితే గెలుపు వ్యత్యాసం పెద్దగా లేకపోవడం వంటివి సానుకూలాంశాలుగా పార్టీ పరిగణిస్తోంది. బీజేపీకి అసలేమాత్రం పట్టులేని నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాల్లో పార్టీని విస్తరించాలంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు అవసరమని, ఈ తరహాలో చేరికలను మరింత ప్రోత్సహించాలని అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో చేరికల కమిటీ చైర్మన్ ఈటల ఓవైపు, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ మరోవైపు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇంకోవైపు.. ఎవరికి వారుగా ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడేందుకు మానసికంగా సిద్ధపడ్డ మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీలోనే ఉండగా, ఆయన బాటలో మరికొందరు కాంగ్రెస్ సీనియర్లు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ఎవరికివారుగా అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement