తెలంగాణ ఫ్యూచరిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా అంశంగా పరిశీలిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఏదైనా వాణిజ్య సంస్థ దీని ఆవిష్కరణకు రూ.500 కోట్లు నిధులు ఇచ్చేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. ప్రభుత్వ పరంగా కూడా నిధులు వచ్చేలా చూస్తామన్నారు.
సచివాలయంలో మంగళవారం ఫ్యూచరిస్టిక్ సెంటర్‌పై కొందరు పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ప్రజెంటేషన్‌ను మంత్రి ఆసక్తిగా వీక్షించారు. భారీ మాల్‌లా ఉండే ఈ సెంటర్‌లో కాన్ఫరెన్స్ హాళ్లు, సినిమా స్క్రీనింగ్ ఏర్పాట్లతో పాటు తెలంగాణ ఘనమైన చరిత్ర, సాధించిన అభివృద్ధి, భవిష్యత్తు గమ్యస్థానాలపై అవగాహన కల్పించేందుకు విభాగాలు ఉంటాయని శ్రీధర్ బాబు వెల్లడించారు.
ఈ కేంద్రం పర్యాటకులను కూడా ఆకర్షిస్తుందని తెలిపారు. ప్రెజెంటేషన్ కార్యక్రమంలో పీఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీ రంగారావు, సుమన్ వల్లపురెడ్డి, హన్మంతరెడ్డి, పునీత్, శ్రీకాంత్ పరమాత్ముని, సునీల్ లడ్డా తదితరులు పాల్గొన్నారు.