తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లోని ఫాక్స్ కాన్ కంపెనీని సందర్శించారు.
ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సమావేశమై కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియుతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సంస్థకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని మరోసారి హామీ ఇచ్చారు.
ఫాక్స్‌కాన్ కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ కోరారు. రాష్ట్రంలో ముఖ్యంగా ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
సీఎం పర్యటన సందర్భంగా ఎమ్మెల్సీ పట్నంమహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ఐటీ శాఖ ఉన్నతాధికారులు, ఫాక్స్ కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.