న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్థన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన వరల్డ్ ఫుడ్ ఇండియా 2023లో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పారిశ్రామికవేత్తలతో సమావేశమై పలు అంశాలను చర్చించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అన్ని విధాల అనువైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రం, పరిశ్రమల స్థాపనకు అన్ని సౌకర్యాలతో, మౌలిక వసతులతో పెట్టుబడులను ఆకర్షించేందుకు సరైన రాష్ట్రమని పేర్కొన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ద్వారా రైతులు పండించిన ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడంతో పాటు, నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ఏపీలో పరిశ్రమల స్థాపనకు మంత్రి కాకాణి సమక్షంలో పలువురు పారిశ్రామికవేత్తలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆంధ్రలో పరిశ్రమల స్థాపదనకు ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలకు మంత్రి కాకాణి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.