Wednesday, September 18, 2024

TG | సింగరేణి అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష..

రాష్ట్ర సచివాలయంలో సింగరేణి సంస్థ భవిష్యత్తు ప్రణాళికలు, సంస్థ అభివృద్ధిపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ దేశ స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి ఉన్న సంస్థ అని.. బొగ్గు ఉత్పత్తిలో తిరుగులేని నైపుణ్యం ఉన్న సింగరేణి ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు.

సింగరేణి సంస్థ తన మనుగడను కొనసాగిస్తూ ఆస్తులను సంపదను సృష్టించుకోవాలని సూచించారు. దాంతో రాష్ట్ర ప్రజల సంపదైన సింగరేణి ద్వారా ఉద్యోగ-ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుందని అన్నారు. సంప్రదాయ ఇంధన వనరులైన పెట్రోల్, డీజిల్, బొగ్గు కాలం చెల్లిపోతున్నాయని… ఎలక్ట్రిక్ బ్యాటరీలు భవిష్యత్తుకు కేంద్రంగా మారబోతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో సింగరేణి సంస్థ‌ లిథియం వంటి పలు మూలకాల అన్వేషణ, వెలికితీతపై దృష్టి సారించాలన్నారు.

గ్రీన్ ఎనర్జీలో భాగంగా రాష్ట్రంలో ఫ్లోటింగ్ సోలార్, పంప్ డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని సింగరేణి అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఇక ఒరిస్సాలోని నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని ఉపముఖ్యమంత్రి ఆరా తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement