భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రేపు భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-08ని నింగిలోకి పంపించనుంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఇదిలా ఉండగా, ఈవోఎస్-08 కోసం ఎస్ఎస్ఎల్వీ పేరుతో రూపొందించిన కొత్త రాకెట్‌ను ఉపయోగిస్తున్నారు. రేపటి ప్రయోగం ఎస్ఎస్ఎల్వీ పరంపరలో మూడోది.
ఈవోఎస్–08 ఉపగ్రహాన్ని మోసుకెళ్లే SSLV-D3 రాకెట్ రేపు ఆగస్టు 16న ఉదయం 9.17 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ఉపగ్రహాన్ని భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతామని ఇస్రో ప్రకటించింది. ఎస్ఎస్ఎల్వీ మోసుకెళ్లే ఈవోఎస్-08 ఉపగ్రహం, ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ పేలోడ్ (EOIR), గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిఫ్లెక్టోమెట్రీ పేలోడ్ (GNSS-R) ఇతర వ్యవస్థలను మోసుకెళ్తుంది.