వచ్చే విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని 1 నుంచి 8 తరగతుల్లోని విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనను ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాసనసభలో వెల్లడించారు. 2023 -24 విద్యాసంవత్సరంలో 9వ తరగతి, 2024 -25 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతుల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇంగ్లీష్ మీడియాన్ని విప్లవాత్మక మార్పుగా సబితా ఇంద్రారెడ్డి అభివర్ణించారు. తాజా పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం హోదాకు చిహ్నంగా మారిందని, ఈ మీడియంలో చదివితేనే ఉద్యోగాలొస్తాయన్న భావన సమాజంలో నెలకొన్నదన్నారు.
రెక్కాడితే కానీ డొక్కాడని తల్లిదండ్రులు సైతం కడుపుకట్టుకుని తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదువుల కోసం ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారని.. అందరి ఆకాంక్ష మేరకు ఇంగ్లీష్ మీడియాన్ని సర్కారు స్కూళ్లల్లో ప్రారంభిస్తున్నామన్నారు. ఇందుకోసం ద్విభాషా పుస్తకాలను సిద్ధంచేశామని, ఈ నెల 14వ తేదీ నుంచి టీచర్లకు శిక్షణనివ్వనున్నామన్నారు. త్వరలోనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని, పాత విద్యాకమిటీలనే కొనసాగిస్తామని, మధ్యాహ్న భోజన పథకం బకాయిలను త్వరలోనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..