Wednesday, November 20, 2024

‘ఇంగ్లిష్‌ మీడియం’ అంచనాలు తారుమారు.. తక్కువగా నమోదైన అడ్మిషన్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంగ్లీష్‌ మీడియం బోధన అంచనాలను అందుకోలేకపోయిందనే విమర్శలు వినిస్తున్నాయి. అధికారులు ముందస్తుగా వేసుకున్న అంచనాలు తారుమారైనట్లు తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో ఈ విద్యా సంవత్సరానికి ప్రైవేట్‌ నుంచి సర్కారు బడుల్లోని ఒకటో తరగతిలో అడ్మిషన్లు నమోదు కాలేదని తెలుస్తోంది. గతేడాది కంటే కూడా ఈ ఏడాది అడ్మిషన్లు తక్కువగా నమోదయ్యాయి. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టి నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం భావించింది.

అనుకున్న విధంగానే ఈ 2022-23 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 26వేలకు పైగా ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం బోధన అందుబాటులో లేకపోవడంతోనే తమ పిల్లలను విద్యార్థుల తల్లిదండ్రులు… ఫీజులు ఎక్కువైనాగానీ ప్రైవేట్‌ స్కూళ్లల్లో చేర్పిస్తున్నారనే నేపథ్యంలో ఇంగ్లీష్‌ మీడియం బోధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంతో పాటు పాఠశాలల్లో తరగతి గదులు మరమ్మతులు, కొత్త వాటి నిర్మాణం, ప్రహరీ గోడలు, టాయిలెట్స్‌, మంచి నీటి సౌకర్యం తదితర 12 రకాల మౌలికవసతులను కల్పించేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని కూడా ఈ ఏడాది నుంచే ప్రవేశపెట్టింది.

ఇప్పటికే కొన్ని స్కూళ్లల్లో మౌలిక వసతులు కల్పించారు కూడా. అయితే ప్రభుత్వం ఏ ఉద్ధేశంతోనైతే ఇంగ్లీష్‌ మీడియం బోధన, మన ఊరు-మన బడి కార్యక్రమాలు తీసుకొచ్చిందోగానీ ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లను పెద్దగా పెంచలేకపోయిందని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్‌ బడులవైపు చూడకుండా ఈ కార్యక్రమాలు నిలువరించలేకపోయాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్‌ నుంచి సర్కారు బడులకు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించలేకపోతున్నారు. అయితే కొన్ని పాఠశాలల్లో సామర్థ్యానికి మించి అడ్మిషన్లు అయ్యాయి.

- Advertisement -

ప్రైవేట్‌ నుంచి వచ్చింది 13 వేలే…

గతేడాది అడ్మిషన్లను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా ప్రైవేట్‌ బడుల నుంచి ప్రభుత్వ బడులకు చాలా అడ్మిషన్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ అలా జరగలేదు. ఈనెల 1వ తేదీ వరకు ప్రీప్రైమరీ, ఒకటి, మిగతా తరగతుల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 2,07,474 మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ బడుల్లో చేరారు. గతేడాది దాదాపు మొత్తం 3.50 లక్షల మంది విద్యార్థులు ఒకటో తరగతిలో చేరారు. దీంట్లోనూ దాదాపు 2.50 లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలల నుంచి సర్కారు బడులకు వచ్చిన వారే ఉండడం గమనార్హం. కానీ ఈ విద్యా సంవత్సరంలో మాత్రం ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు ఒకటో తరగతిలో చేరింది 13,379 మంది మాత్రమే. అంటే ప్రీప్రైమరీని ప్రైవేటు బడుల్లో చదివి ఇంగ్లీష్‌ మీడియం కోసం ప్రభుత్వ బడుల్లో చేరినవారు వీరు మాత్రమే ఉన్నారు. గతేడాది ఒకటో తరగతిలో దాదాపు 3.18 లక్షల మంది చేరితే ఈనెల 1వ తేదీ వరకు చేరింది 1,13,273 మంది మాత్రమే. ఇందులో అత్యధికంగా 95,129 మంది విద్యార్థులు అంగన్‌ వాడి కేంద్రాల నుంచి వచ్చిన వారే ఉన్నారు.

డైరెక్ట్‌గా ఒకటో తరగతిలో అడ్మిషన్ల కోసం వచ్చింది 30,765 మంది కాగా, ప్రైవేట్‌ బడుల నుంచి ఒకటో తరగతికి వచ్చింది మాత్రం కేవలం 13,379 మాత్రమేఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రీప్రైమరీ తరగతుల్లో చేరింది 2371 మంది ఉన్నారు. అయితే ప్రైవేట్‌ నుంచి వచ్చి ప్రభుత్వ బడుల్లో 2వ తరగతి నుంచి 12వ తరగతులల్లో చేరింది 65,380 మంది ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వ విద్య ఆకర్షించకపోవడంలో చాలా కారణాలే ఉన్నాయి. ఇంగ్లీష్‌ మీడియం బోధనపై నమ్మకాన్ని కల్గించకపోవడం, సరిపడా టీచర్లు అందుబాటులో లేరనే అభిప్రాయం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉండడంతో వారు ప్రభుత్వ బడులవైపు ఆసక్తి చూపించడంలేదని అభిప్రాయాలను విద్యావర్గాలు వెల్లడిచేస్తున్నాయి. ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రారంభించిన ప్రభుత్వం…దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆశించిన స్థాయిలో సఫలీకృతం కాలేదని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement