Tuesday, November 26, 2024

తొలిటెస్టు ఇంగ్లండ్‌దే.. పాక్‌పై 74 పరుగుల తేడాతో విజయం

దాదాపు 17ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ శుభారంభం చేసింది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ జట్టు ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 74 పరుగులతో గెలిచి మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్‌ గడ్డపై ఇంగ్లండ్‌ ఓ టెస్టు మ్యాచ్‌లో గెలవడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. 1961లో లాహోర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరం 39 సంవత్సరాల తర్వాత కరాచీలో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ గెలుపొందింది. తాజాగా రావల్సిండిలో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగుస్తుంది అనుకున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించారు.

343 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో పాక్‌ టార్గెట్‌ దిశగా దూసుకెళ్లి ఇంగ్లండ్‌ను భయపెట్టింది. ఇమాముల్‌ హక్‌ (48), అజర్‌ అలీ (40), సాద్‌ షకీల్‌ (76), మహ్మద్‌ రిజ్వాన్‌ (46), అషూ సల్మాన్‌(30) లాంటి వాళ్లు పోరాడినా ఫలితం లేకపోయింది. పాకిస్తాన్‌ చివరి జోడీ నసీమ్‌ షా, మహ్మద్‌ అలీ పదో వికెట్‌ పడకుండా చాలాసేపు అడ్డుకున్నారు. 8.5 ఓవర్లపాటు పోరాడి మ్యాచ్‌ను డ్రాగా ముగించడానికి ప్రయత్నించారు. ఓ వైపు ఓవర్లు కరిగిపోతుండటంతో ఇంగ్లండ్‌ అన్ని విధాలుగా చివరి వికెట్‌ తీయడానికి ప్రయత్నించింది. చివరికి స్పిన్నర్‌ లీచ్‌… నసీమ్‌ షా(6)ను ఎల్‌బీ డబ్ల్యూగా ఔట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ గెలుపు సంబరాల్లో ముగినిపోయింది.

ఇంగ్లండ్‌ బౌలర్లలో ఓలీ రాబిన్సన్‌, జేమ్స్‌ అండర్సన్‌ నాలుగేసి వికెట్లు తీశారు. రావల్పిండిలాంటి బ్యాటింగ్‌ పిచ్‌పై 20 వికెట్లు తీసి మ్యాచ్‌ను గెలిపించడం ఇంగ్లండ్‌ బౌలర్లకే చెల్లింది. అయితే ఈ మ్యాచ్‌ మలుపులు తిరుగుతూ చివరి సెషన్‌లో ఇలాంటి ఫలితం ఇవ్వడం టెస్టు మ్యాచ్‌ మజాను అభిమానులు ఆస్వాదించినట్లయింది. ఈ విజయంతో ఇంగ్లండ్‌ మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు డిసెంబర్‌ 9 నుంచి 13 వరకు ముల్తాన్‌ వేదికగా జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement