బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (17), ఛతేశ్వర్ పుజరా (13) జట్టుకు శుభారంభాన్ని అందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన హనుమ విహారి (20), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (11) తీవ్ర నిరాశపరిచారు. శ్రేయాస్ అయ్యర్ (15) కూడా రాణించలేకపోయాడు. దీంతో 28 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం రిషబ్ పంత్ 13 పరుగులతో, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 3 కీలక వికెట్లు పడగొట్టగా, మాథ్యూ పాట్స్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ ఆటగాడు అండర్సన్ బౌలింగ్(6.2)లో క్రాలేకు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు. ఓపెనర్ ఛతేశ్వర్ పుజారా (13) అండర్సన్ బౌలింగ్‌లో క్రాలేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ గిల్ వికెట్ కూడా అండర్సన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ దశలో వరుణుడు ఆటంకం కలిగించాడు. వర్షం కారణంగా మొదటి రోజు లంచ్ బ్రేక్ తర్వాత ఆట ఆగింది. అప్పటికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. వర్షం ఆగిన అనంతరంలో విరాట్ కోహ్లీ 1, హనుమ విహారి 14 పరుగులతో ఆటను ప్రారంభించగా, ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టు నేపథ్యంలో రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమిండియా కెప్టెన్‌గా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారి బాధ్యతలు చేపట్టాడు. జట్టు సారథి హోదాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌తో కలిసి టాస్ సమయంలో ఎడ్జ్‌బాస్టన్ మైదానానికి వచ్చాడు. ఈ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ… ”భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కడం నాకు దక్కిన గౌరవం. ఇంతకంటే నేను కోరుకునేది మరేదీ లేదు. కెప్టెన్సీ విషయంలో ఎంతో ఉత్సాహంగా ఉన్నా” అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.
జోరూట్‌కు వెండి బ్యాట్ (ఫొటో రైటప్)
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్, టెస్టు జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో ఐసీసీ వెండి బ్యాట్ కానుకగా అందజేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోనే ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. టీమిండియాతో రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్‌కు ముందు రూట్ ఈ అరుదైన బహుమతి అందుకోవడం విశేషం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.