Monday, November 25, 2024

ఇంగ్లండ్‌కు భారీ షాక్.. క్రికెటర్ రాబిన్‌సన్‌పై సస్పెన్షన్ వేటు

ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కు భారీ షాక్ త‌గిలింది. న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి టెస్ట్‌తోనే అరంగేట్రం చేసి అద‌ర‌గొట్టిన పేస్ బౌల‌ర్ ఓలీ రాబిన్‌స‌న్‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి స‌స్పెండ్ చేశారు. ట్విట‌ర్లో జాతి వివ‌క్ష‌, మ‌హిళ‌ల ప‌ట్ల వివ‌క్ష పూరిత కామెంట్లు చేశాడంటూ అత‌డిపై చ‌ర్య తీసుకున్నారు. ఈ కేసు 2012-13కు సంబంధించిన‌ది. అప్ప‌ట్లో అత‌డు టీనేజ‌ర్‌. ప్ర‌స్తుతం దీనిపై విచార‌ణ జ‌రుగుతోంది. అది పూర్త‌య్యే వ‌ర‌కూ రాబిన్‌స‌న్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆడే అవ‌కాశం లేదని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆదివారం వెల్ల‌డించింది. లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి టెస్ట్‌తోనే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రాబిన్‌స‌న్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.

అంతేకాదు తొలి ఇన్నింగ్స్‌లో కీల‌క‌మైన స‌మ‌యంలో 42 ప‌రుగులు చేసి ఇంగ్లండ్ ప‌రువు నిల‌బెట్టాడు. అసలు మ్యాచ్ డ్రా కావ‌డంతో అత‌నిదే కీల‌క‌పాత్ర‌. క్రికెట్ నుంచి సస్పెండ్ చేయ‌డంతో న్యూజిలాండ్‌తో ఈ నెల 10 నుంచి ప్రారంభ‌మ‌య్యే రెండో టెస్ట్‌కు అత‌డు దూరం కానున్నాడు. స‌సెక్స్‌కు ఆడే రాబిన్‌స‌న్ వెంట‌నే ఇంగ్లండ్ టీమ్‌ను వీడి త‌న కౌంటీకి వెళ్లిపోనున్నాడ‌ని ఈసీబీ తెలిపింది. టీనేజ‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో ముస్లిం క‌మ్యూనిటీని ఉగ్ర‌వాదానికి ముడిపెడుతూ ట్వీట్లు చేయ‌డంతోపాటు మ‌హిళ‌ల‌పై, ఆసియా ఖండ ప్ర‌జ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. తొలి రోజు అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడిన త‌ర్వాత గ‌త బుధ‌వారం ఈ వ్యాఖ్య‌ల‌పై అత‌డు క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పాడు. అలాంటి పోస్టులు చేసినందుకు తాను సిగ్గుప‌డుతున్న‌ట్లు రాబిన్‌స‌న్ చెప్పాడు. తాను జాతి వ్య‌తిరేకిని కాద‌న్నాడు. అలాంటి ట్వీట్లు తాను ఊహించ‌లేద‌ని మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కూడా చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement