హైదరాబాద్, ఆంధ్రప్రభ : చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మొద్దు నిద్ర వహిస్తుండటంతో కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు తమ పనిని చక్కబెట్టుకుంటున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్‌సీ)కు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని నిబంధనలను పాతరేసి మేనేజ్‌మెంట్ కోటా (బీ-కేటగిరీ) సీట్లను రూ.లక్షలకు అమ్మేసుకుంటున్నాయి. తమ ఆధీనంలో ఉండే ఉండే 30 శాతం మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కాలేజీలు గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకునే పనిలో పడ్డాయి. కొన్ని కాలేజీల్లో ఇప్పటికే ఈ కోటాలోని సగానికి పైగా సీట్లు భర్తీ అయినట్లుగా సమాచారం.
రాష్ట్రంలో ఇంకా ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 26 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కానీ అప్పుడే చాలా కాలేజీలు మేనేజ్‌మెంట్ కోటా సీట్లను అమ్మేసుకుంటున్నాయి. సాధారణంగా ఉన్నత విద్యా మండలి ఈ సీట్ల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వవలసి ఉంటుంది. ఆతర్వాతే ఆయా కాలేజీలు సీట్లను భర్తీ చేయాలి. కానీ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమే కాలేదు, మరోవైపు మేనేజ్‌మెంట్ కోటాకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనేలేదు. కాలేజీలు మాత్రం తమ పని చక్కదిద్దుకుంటున్నాయి.
సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ, సైబర్ సెక్యూరిటీస్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులకు విద్యార్థుల్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఈ కోర్సుల్లో తమ పిల్లలను చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కాలేజీలు సీట్ల విషయంలో ముందే బేరసారాలు చేసుకుంటున్నట్లు పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాలేజీలను సంప్రదిస్తే సీట్లు అయిపోయాయని సమాధానాలు వస్తున్నాయని, ఒకవేళ ఉన్నా రూ.లక్షల్లో ఫీజులు చెబుతున్నట్లు సమాచారం. పైగా ఫైరవీ ఉంటేనే సీట్లు దొరుకుతున్నాయి.
ఒక్కో కాలేజీలో సీటుకో రేటు…
ఒక్కో కాలేజీలో బ్రాంచ్… బ్రాంచ్‌కు ఒక్కో రేటు ఫిక్స్ చేసి సీట్ల దందాకు పాల్పడుతున్నారు. ఇంజనీరింగ్‌కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అందులోనూ డిమాండ్ ఉన్న కాలేజీల్లో, డిమాండ్ ఉన్న కోర్సుకు ఇక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజీని బట్టి సీటు.. రేటు ఫిక్స్ అవుతోంది. రాష్ట్రంలోని పేరుమోసిన కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు భారీ ధర పలుకుతున్నాయి. కాలేజీని బట్టి సీఎస్‌ఈలో ఒక్కో సీటు- రూ.6 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో 170 వరకు కాలేజీలుంటే అందులో లక్షకు పైగా సీట్లు ఉన్నాయి.
నిబంధనలు ప్రకారం ఇంజనీరింగ్ స్లీల్లో 70 శాతం కన్వీనర్ కోటాలో, 30 శాతం యాజమాన్య కోటా ద్వారా సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. యాజమాన్య కోటా సీట్లకు కూడా కన్వీనర్ కోటా ఫీజునే వసూలు చేయాలి. కానీ దానికి నాలుగైదు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ అనంతరం నోటిఫికేషన్ విడుదల చేసి జేఈఈ మెయిన్, ఎంసెట్ మెరిట్ ఆధారంగా కేటాయించాల్సిన బీ-కేటగిరీ సీట్లను మార్కెట్‌లో లేని పోటీని ఉన్నట్లు సృష్టించి సీట్లకు రూ.లక్షలు దండుకుంటున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
అధికారులకు ఇదంతా తెలిసినా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇంజనీరింగ్ కాలేజీలు మాజమాన్య కోటా సీట్లను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని, ఏ విద్యార్థి అడిగినా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని గతంలో టీఏఎఫ్‌ఆర్‌సీ స్పష్టం చేసినా దాన్ని కాలేజీలు ఏమాత్రం పట్టించుకోవడంలేదు.
నిబంధనలు ఇలా…
ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో బీ-కేటగిరీ 30 శాతం సీట్లకు అర్హులైన వారితో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తులను స్వీకరించాలి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మూడు దినపత్రికల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటు-ంది. విద్యార్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను ప్రతిరోజూ కాలేజీలోని నోటీసు బోర్డు, వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి బ్రాంచ్ వారీగా మెరిట్ జాబితాను ప్రకటించాలి.
కానీ ఈ నిబంధనలు ప్రైవేట్ యాజమాన్యాలు పాటించడంలేదని ఆరోపణలున్నాయి. మెరిట్ విద్యార్థులకు కాకుండా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే అన్నట్లు-గా సీట్లను విక్రయిస్తున్నారు. ఎంసెట్ ఫలితాలు వెలువడిన కాన్నుంచే ఈ రకమైన దందాకు కొన్ని కాలేజీలు తెరలేపాయి.